
బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు
హైదరాబాద్: రాబోయే రోజుల్లో కేసీఆర్ అంచనాలు తారుమారు అవుతాయని, రేపు అమిత్ షా పర్యటనలో అన్నింటికీ సమాధానం ఇస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో మురళీధర్ రావు విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఈ ఎన్నికల్లో ఓడిచేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాకిస్తాన్‌తో కూడా కలుస్తారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ను ఓడించాలని కాంగ్రెస్‌కు ఓటేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఈ మూడు పార్టీలూ ఒక తాను ముక్కలేనని వ్యాక్యానించారు.
కాంగ్రెస్ పార్టీ ఈ నాలుగేళ్లలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలైంది..దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓటమి పాలైన కాంగ్రెస్ ఇప్పుడు ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. ఉత్తమ్ చెవులు ఇక్కడ పెట్టి వినాలని ఎద్దేవా చేశారు. రాబోయే అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలువదని జోస్యం చెప్పారు. అధికారంలో లేకపోతే కాంగ్రెస్ మావోయిస్టులతో కలుస్తారా అని ప్రశ్నించారు. అధికార దాహంతో ఎవరితోనైనా కాంగ్రెస్ కలుస్తుందని విమర్శించారు. విరసం నేత వరవరరావును ఎన్ని సార్లు కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేయించిందో కాంగ్రెస్ గుర్తు చేసుకోవాలని సూచించారు. తెలంగాణాకు మోదీ అన్ని విధాలుగా సాయం చేస్తున్నారు..చేస్తారని తెలిపారు.
తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చేందుకు టీఆర్ఎస్‌కు ప్రజలు పట్టం కట్టారు కానీ ఈ నాలుగేళ్లుగా అనేక హామీలు కేసీఆర్ విస్మరించారని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారు. అసలు ఎందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు..ఇంత ఖర్చు ఎందుకు అనే ప్రధాన ప్రశ్నకు కేసీఆర్ సమాధానం చెప్పడం లేదని వ్యాఖ్యానించారు. మూడెకరాల భూమి,అంబెడ్కర్ విగ్రహం, మాదిగ భవన్ అన్నారు అవి ఎక్కడా ఏర్పాటు చేయలేదని వెల్లడించారు.
ఇసుక మాఫియాతో ప్రభుత్వం నడుస్తోందని మండిపడ్డారు. 10 శాతం మంది ఎస్టీలు ఉంటే వారికి 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసపూరిత మాటలను చెప్పారని మండిపడ్డారు. రైతు ఆత్మహత్యలపై లెక్కలు తారుమారు చేస్తున్నారు...కేంద్రం వ్యవసాయంపైన అనేక పథకాలు పెడితే అమలు చేయడం లేదని విమర్శించారు. ఉద్యోగాల విషయంలో ఇప్పటి వరకు టీఆర్ఎస్‌కు క్లారిటీ లేదని, రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు కానీ 37 వేల ఉద్యోగాలే ఇచ్చారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment