హైదరాబాద్: తీవ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఉదంతాలను కాంగ్రెస్ కార్యకర్తలెవరూ మరచిపోలేదని, అట్లాంటి తీవ్రవాద వ్యతిరేక నినాదంతో ముందుకెళ్లిన కాంగ్రెస్.. ఇటీవల కాలంలో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తీవ్రవాదులకు మద్ధతు తెలుపుతుందని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. హింసావాదంపై అవకాశవాద వ్యాఖ్యలు చేస్తోన్న కాంగ్రెస్ నాయకుల తీరుతో పార్టీ భ్రష్టు పట్టిపోయిందని మండిపడ్డారు. పుల్వామా దాడి తర్వాత యావత్ భారతదేశం పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని కోరుకుంటే.. కాంగ్రెస్ సీనియర్ నేతలు మాత్రం పాకిస్తాన్‌కు వత్తాసు పలికే విధంగా అసందర్భ వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాలను భ్రష్టు పట్టించారని తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ కారణం చేతనే తాను కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చిందని పొంగులేటి పేర్కొన్నారు.
‘నేను కాంగ్రెస్ పార్టీని వీడే సమయంలో కూడా పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి రాసిన లేఖలో కాంగ్రెస్ మేధావులమని చెప్పుకునే కొందరు నేతల అహంకారపూరిత, బాధ్యతారహితమైన వ్యాఖ్యల వల్ల పార్టీ పేరు మంట గలుస్తోందని, వారి అదుపులో ఉంచాలని హెచ్చరించాను.కానీ ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న ఆక్రోశంతో, ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు మతి భ్రమించిన విధంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ అపరమేధావి శామ్ పిట్రోడా, సిక్కుల ఊచకోతకు సంబంధించి ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేశారో.. అవి ఎంత దుమారం రేపాయో చూశాం. శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలకు సిగ్గు పడాలని, ఆయన సిక్కులకు క్షమాపణ చెప్పాలని రాహుల్ కంటి తుడుపుగా ఓ ప్రకటన చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. కానీ రాహుల్‌కు చిత్తశుద్ధి ఉంటే పిట్రోడాను కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలి. అలా చేయని పక్షంలో సిక్కులు ఎన్నటికీ కాంగ్రెస్‌ను క్షమించర’ని పొంగులేటి వ్యాఖ్యానించారు.
‘నేను ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను. ఏ రాష్ట్రానికి వెళ్లినా మోదీ ప్రభంజనమే కనిపిస్తోంది. మోదీకి సాటిగా నిలబడగలిగే నేత లేకపోవడం వల్ల ఢిల్లీ నుంచి గల్లీ స్థాయి నేతలంతా తాము కూడా ప్రధాని పదవి రేసులో ఉన్నామని చెప్పుకునే పరిస్థితి ఉత్పన్నమైంది. అరచేతితో సూర్యుడి వెలుతురును ఆపలేరు. అనామక పార్టీలన్నీ ఏకమై కూటమిగా ఏర్పడినా మోదీ ప్రధాని కావడాన్ని అడ్డుకోలేవ’ని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment