బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ(పాత చిత్రం)
గుంటూరు : మిత్ర ధర్మాన్ని పాటించి ఏపీలో అక్రమాలు, అవినీతిపై ఇన్నాళ్లూ నోరు మూసుకుని ఉన్నామని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ..ఇసుక మాఫియా, దందాపై ఎప్పటికప్పుడు లెక్కలు అడిగినందుకు టీడీపీ బయటికి వెళ్లిందని ఆరోపించారు. సెవెన్ స్టార్ హోటల్స్, ఈవెంట్ మేనేజ్మెంట్సకే డబ్బులు తగలేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో అడ్డమైన హామీలు ఇచ్చి, ఒక్కటీ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు.
ఏపీలో అవినీతి, అసమర్థపాలన సాగిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం టీడీపీని నమ్మి మోసపోయిందని వ్యాఖ్యానించారు. టీడీపీ అసమర్థతతోనే ఏపీకి అన్యాయం జరిగిందని అన్నారు. జల్సాగా స్పెషల్ ఫ్లయిట్‌లో దేశ దేశాలు తిరిగి..చివరికి రాజధాని ప్లాన్ కోసం రాజమౌళి వద్దకు వచ్చారని విమర్శించారు. పోలీసులను టీడీపీ కార్యకర్తల్లా వాడుకుని ఏదైనా అడిగితే ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
చంద్రబాబు నాయుడు తాత్కాలిక సీఎం అని..అందుకే తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సెక్రటేరియట్లను నిర్మించారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీని ఎన్టీఆర్ భవన్ అనుకుంటున్నారా ? అమిత్ షా లేఖ రాస్తే అసెంబ్లీలో ఎలా చదువుతారు ? అసెంబ్లీలో ఏనాడైనా ప్రజల సమస్యలపై చర్చించారా? అని చంద్రబాబునుద్దేశించి ప్రశ్నించారు. ఏపీని మోసం చేసింది సీఎం చంద్రబాబేనని, పార్లమెంటులో చర్చ జరిగితే చంద్రబాబు అవినీతి బయటకు వస్తుందని భయపడుతున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment