
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప పదవీ బాధ్యతలు స్వీకరించిన్పటి నుంచి బీజేపీలో అంతర్గత ముసలం కొనసాగుతోంది. ఆశించిన పదవులు దక్కకపోవడంతో పలువురు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య బీజేపీలోని కొందరు ప్రముఖ నేతలు కాఫీనాడు రిసార్టులో రహస్యంగా భేటీ కావడం సంచలనంగా మారింది. వీరి రహస్య సమావేశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. చిక్కమగళూరు తాలూకా ముళ్లయ్యనగిరిలో ఉన్న రిసార్టులో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బెంగళూరు కోవిడ్ ఇన్‌చార్జి ఆర్.అశోక్, ఇతర మంత్రులు సీటీ రవి, జగదీశ్ శెట్టర్, ఈశ్వరప్పలు పాల్గొన్నారు. అంతేకాకుండా సతీశ్ రెడ్డి, మునిరాజు, కృష్ణప్ప తదితర ప్రముఖ నాయకులు సమావేశమై రాత్రికిరాత్రి తిరిగి బెంగళూరుకు చేరుకోవడం విశేషం. (మేమే కర్ణాటక వస్తాం..అన్నీ తేలుస్తాం)
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి యడియూరప్ప, ఆయన కుమారుడు విజయేంద్ర కార్యవైఖరిపై చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా యడియూరప్పకు వ్యతిరేకంగా పార్టీ సీనియర్ నేత బసన్నగౌడ పాటిల్ చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. ఆయన వర్గంగా భావిస్తున్న కొంతమంది ఎమ్మెల్యేలతో రహస్య మంతనాలు చేస్తున్నారనే వార్తలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. అయితే తాము ఎలాంటి రహస్య సమావేశం ఏర్పాటు చేయలేదని మంత్రి ఆర్.అశోక్ వెల్లడించడం గమనార్హం. కాంగ్రెస్-జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి కేంద్ర అండదండలతో యడియూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసింది. కుమారస్వామికి వ్యతిరేకంగా నిరసన స్వరాలు వినిపించి.. ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలకంగా మారిన 15 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా ఇప్పడు బీజేపీ సర్కార్‌లో కీలక పదవుల్లో ఉన్నారు.
వీరిలో కొంతమందికి మంత్రి పదవులు కూడా దక్కాయి. ఈ పరిణామం సొంత పార్టీలోని నేతలకు అస్సలు మింగుడు పడటంలేదు. పార్టీని నమ్ముకుని ఎప్పటి నుంచో ఉంటున్న తమను కాదని.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం ఏంటని తమ అసంతృప్తికి వెల్లగక్కుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు సీనియర్లు యడియూరప్పను వెంటనే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి ఆ బాధ్యతలను కొత్తవారికి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment