
హైదరాబాద్: ప్రతి ఒక్క భారతీయుడు పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని, దీనికి ప్రతి పౌరుడు చావడానికైనా, చంపడానికైనా సిద్ధంగా ఉండాలని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథా గద్గద స్వరంతో వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో అమరులైన సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ శుక్రవారం బీజేపీ, హిందూ వాహిణి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కె. లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజా సింగ్, హిందూ వాహిణి కార్యకర్తలు పాల్గొన్నారు.
రాజా సింగ్ మాట్లాడుతూ.. ఉగ్రమూలాలు కూకటివేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే మోదీ కూడా సైనికులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని తెలిపారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రం పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 40 మంది జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. మరో 70 మంది జవాన్లు కూడా గాయపడ్డారు.