Raja singh lodha
-
Hyderabad: పరేషాన్లో పాతబస్తీ.. రంగంలోకి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్!
ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరం వారం, పదిరోజులుగా నిత్యం ఏదో ఒక విషయంతో జాతీయ స్థాయి వార్తల్లో ఉంటోంది. మునావర్ కామెడీ షో అనౌన్స్మెంట్ మొదలు తాజాగా జరుగుతున్న రాజాసింగ్ ఇష్యూ వరకు ప్రతి రోజూ నగరానికి సంబంధించిన విషయాలు వేడి పుట్టిస్తున్నాయి. నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు పహారా పెంచడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాత బస్తీలో ఆంక్షలు విధించడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఒకసారి ఈ మొత్తం ఘటనలను పరిశీలిస్తే.. హైదరాబాద్ మహానగరంలో మునావర్ కామెడీ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే గతంలో ఓ వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడిన మునావర్ షోకు అనుమతి ఎలా ఇస్తారని గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా తప్పుబట్టారు. మునావర్ షో నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. షోను అడ్డుకుంటామని చెప్పారు. అంతకు ముందు కూడా ఎక్కడ షో నిర్వహిస్తారో ఆ హాల్‌ను దగ్దం చేస్తామని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఈ పరిస్థితులు నడుమ రాజాసింగ్ హెచ్చరికతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తుగా ఆయన్ను అదుపులోకి తీసుకొని హౌజ్ అరెస్ట్ చేశారు. ఉత్కంఠతో మొదలై.. ప్రశాంతంగా ముగిసిన మునావర్ షో ఆద్యంతం ఉత్కంఠ, ఉద్రిక్తత, అరెస్టుల నడుమ మునావర్ ఫారూఖీ ఆగస్టు 20న హైదరాబాద్‌లో నిర్వహించిన కామెడీ లైవ్ షో ‘డోంగ్రీ టు నోవేర్’ ప్రశాంతంగా ముగిసింది. మునావర్ గతంలో హిందూ దేవతలను కించపరిచారని... అందుకే నగరంలో ఆయన షోను జరగనివ్వబోమంటూ బీజేపీ, వీహెచ్‌పీ హెచ్చరించిన నేపథ్యంలో మాదాపూర్‌లోని శిల్పకళావేదిక, పరిసర ప్రాంతాల్లో 1,500 మంది పోలీసులు బందోబస్తు చేపట్టి కార్యక్రమం ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ఒకటి తర్వాత మరొకటి నగరంలో సోమవారం రాత్రి నుంచి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ కె.కవిత ఇంటిపై దాడి చేసిన బీజేపీ నేతల అరెస్టులు జరుగుతుండగానే... ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పదల వ్యాఖ్యల వీడియో వైరల్ అయింది. దీనిపై పెద్ద స్థాయిలో నిరసనలు, కేసులు, అరెస్టు తదితరాలతో నగరం రణరంగంగా మారింది. దీనికితోడు రియల్ ఎస్టేట్ కంపెనీలపై జరిగిన ఆదాయపు పన్ను శాఖ దాడులు కలకలం సృష్టించాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం పరిణామాల నేపథ్యంలో బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై సోమవారం బీజేపీ నాయకులు దాడి చేశారు. దీనికి సంబంధించి బీజేపీ నాయకులు, కార్యకర్తలపై బంజారాహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. అనేక మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు, అరెస్టులపై బీజేపీ శ్రేణులు అర్ధరాత్రి వరకు ఆందోళనలకు దిగాయి. ఇది సద్దుమణగక ముందే ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యల వీడియో వైరల్‌గా మారింది. దీంతో నగర వ్యాప్తంగా నిరసనలు జరగడంతో పాటు ఆందోళనకారులు బషీర్‌బాగ్ పాత కమిషనరేట్ వద్దే ఆందోళనకు దిగారు. ఆపై రాజాసింగ్‌పై వరుస ఫిర్యాదులు, కేసుల నమోదు మొదలైంది. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌కు సంబంధించిన చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చర్లపల్లిలోని రైల్వే టెర్మినల్ సందర్శన సైతం రద్దయింది. ఇదిలా ఉండగా.. కొన్ని రోజులుగా నగరంలోని అనేక సంస్థలు, వ్యక్తులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. వీటికి కొనసాగింపుగా అన్నట్లు మంగళవారం రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉన్న సంస్థ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేయడం కలకలం సృష్టించింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సభ సోమవారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జరిగింది. దీంతో సోమవారం నుంచి చోటు చేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో నగర ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడిపారు. పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపట్టారు. పాత కమిషనరేట్ వద్ద నిరసన ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలపై ఓ పక్క బందోబస్తు ఏర్పాట్లు కొనసాగుతుండగానే ఆందోళనకారులు బషీర్‌బాగ్‌కు చేరుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో దాదాపు 3 వేల మంది ఆందోళనకారులు బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్ వద్దకు వచ్చారు. రాజాసింగ్‌ను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. అయితే అక్కడకు వచ్చిన ప్రత్యేక బలగాలు పరిస్థితి అదుపు తప్పకుండా చర్యలు తీసుకున్నాయి. కేసుల మీద కేసులు రాజాసింగ్ వ్యాఖ్యలపై హైదరాబాద్ దక్షిణ మండలంలోని డబీర్‌పుర ఠాణాలో మొదటి కేసు నమోదైంది. ఆపై మంగళ్‌హాట్, షాహినాయత్‌గంజ్, బాలానగర్ సహా ఆరు చోట్ల కేసులు రిజిస్టర్ అయ్యాయి. రాష్ట్రంలోని మరికొన్ని పోలీసుస్టేషన్లలో కూడా కేసులు నమోదయ్యాయి. 10 నిమిషాల 27 సెకన్ల నిడివితో ఉన్న రాజాసింగ్ వీడియోకు సంబంధించి మంగళ్‌హాట్ ఠాణాలో ఐపీసీలోని 153–ఎ, 295–ఎ, 505 (2), 506 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. ఉద్రిక్తత మధ్య అరెస్టు మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ధూల్‌పేట్‌లోని రాజాసింగ్ ఇంటికి మంగళ్‌హాట్ పోలీసులతో పాటు నగర టాస్క్‌ఫోర్స్ అధికారులు చేరుకున్నారు. వీరిని రాజాసింగ్ అనుచరులతో పాటు బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఓ దశలో పోలీసులు, రాజాసింగ్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తనకు నోటీసు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ రాజాసింగ్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు సమయంలో మీడియాతో మాట్లాడుతూ.. ధర్మం కోసం చావడానికైనా సిద్ధమని, వెనక్కి తగ్గేదిలేదని అన్నారు. తన వీడియో రెండో పార్ట్ కూడా త్వరలోనే విడుదల చేస్తానన్నారు. అతికష్టమ్మీద రాజాసింగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు తీసుకువచ్చారు. నేరుగా బొల్లారం ఠాణాకు తరలించారు. ఈ విషయం తెలిసిన తర్వాత బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్ వద్ద నుంచి ఆందోళనకారులు వెళ్లిపోయారు. బీజేపీ నుంచి రాజాసింగ్ సస్పెన్షన్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వీడియోలో మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తక్షణమే పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు పార్టీ కేంద్ర క్రమశిక్షణ కమిటీ మంగళవారం ప్రకటించింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో సెప్టెంబర్ 2వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ కమిటీ సభ్య కార్యదర్శి ఓం పాఠక్ మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జూన్ నెలలో నూపుర్ శర్మ ఉదంతంతో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో, రాజాసింగ్ వీడియోను బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. పార్టీకి నష్టం జరగకుండా చూసే క్రమంలో ఎమ్మెల్యేపై చర్యలకు దిగింది. కోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం మధ్యాహ్నం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం పోలీసులు రాజాసింగ్‌ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 41సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని రాజాసింగ్ తరపు న్యాయవాదులు కోర్టులు వాదనలు వినిపించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పోలీసులు అరెస్ట్ చేయడం చట్టవిరుద్దమని తెలిపారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి, ఇరుపక్షాల వాదనల అనంతరం.. పోలీసుల వినతిని తిరస్కరించారు. దీంతో పోలీసులు రాజాసింగ్‌ను మంగళవారం రాత్రి ఆయన ఇంటి వద్ద విడిచిపెట్టారు. రాజాసింగ్ కోర్టులో ఉన్న సమయంలో ఆయనకు అనుకూలంగా, వ్యతిరేకంగా అనేకమంది కోర్టు వద్దకు చేరుకున్నారు. ఓ దశలో పరిస్థితి అదుపుతప్పేలా కన్పించింది. దీంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు లాఠీచార్జి చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. రాజాసింగ్ వ్యాఖ్యలకు నిరసనగా చార్మినార్ పరిసరాల్లోని చిరు వ్యాపారులతో దుకాణాలను స్వచ్ఛందంగా బంద్ చేసి నిరసన తెలిపారు. వదంతులు నమ్మొద్దు ‘రాజా సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో పాతబస్తీలో కొందరి మనో భావాలు దెబ్బతిన్నాయి. వీడియో పోస్టు చేసిన వ్యక్తిపై ఇప్పటికే కేసు నమోదు చేశాము. చర్యలు తీసుకున్నాము. ఈ కేసులో ఓ లీగల్ అడ్వైజర్‌ను ఏర్పాటు చేశాం. ఎవరూ వదంతులు నమ్మవద్దు. ముందస్తు చర్యల్లో భాగంగా సెన్సిటివ్ ఏరియాల్లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను పెట్టాము. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మొద్దు అనీ విజ్ఞప్తి చేస్తున్నాము. పాతబస్తీలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదు. పాతబస్తీ అంత కూడా ప్రశాంతంగా ఉంది. పరిస్థితులు కంట్రోల్లో ఉన్నాయి' అని సౌత్‌జోన్ డీసీపీ సాయి చైతన్య తెలిపారు. దూసుకొచ్చిన ఆందోళనకారులు శాలిబండ చౌరస్తాలో రాజా సింగ్‌కు వ్యతిరేకంగా బుధవారం మరోసారి పెద్ద ఎత్తున ఆందోళనకారులు దూసుకొచ్చారు. నల్లజెండాలు ప్రదర్శిస్తూ.. నిరసన తెలుపుతూ శాలిబండ చౌరస్తా నుంచి చార్మినార్ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సమూహాన్ని శాలిబండ చౌరస్తాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజా సింగ్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జనాలను చెదరగొట్టేందుకు స్వల్ప లాఠీ చార్జ్ చేశారు. నిరసనకారుల్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. పాతబస్తీలో హైటెన్షన్ ఓల్డ్ సిటీలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. శాలిబండ, మొగల్‌పూర ఘటనలపై చార్మినార్ పోలీస్ స్టేషన్లో అడిషనల్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, పోలీస్ ఉన్నతాధికారులు సమీక్షించారు. ఇప్పటికే మతపెద్దలతోనూ చర్చించారు. మరోసారి ఘటనలు జరగకుండా చూడాలని పోలీసులు సూచించారు. పాతబస్తీలో 14 సున్నిత ప్రదేశాల్లో భారీగా బందోబస్తు నిర్వహించారు. ఇప్పటికే ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. సీఎం కేసీఆర్ రివ్యూ పాతబస్తీ అలజడిపై పోలీసులు పలు ఆంక్షలు విధించారు. రాత్రి 7గంటలలోపు షాపులన్నీ బంద్ చేయాలని పోలీసులు పెట్రోలింగ్ వెహికల్స్‌తో పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పాతబస్తీలో దుకాణాలను పోలీసులు మూసివేయించారు. పలుచోట్ల పెట్రోల్ బంక్‌లు బంద్ చేయించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. కీలక ప్రాంతాలలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించింది. పాతబస్తీలో ర్యాలీలు, ధర్నాలు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఓల్డ్‌సిటీలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. సిటీలో ఆందోళనలపై సీఎం కేసీఆర్ రివ్యూ నిర్వహించారు. దాదాపు 3 గంటలకు పైగా పోలీసుల ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. -
ఎంజే మార్కెట్ స్లాబ్‌కు రంద్రాలు.. 16 కోట్లు దేనికి
అబిడ్స్: ఎంజే మార్కెట్ ఆధునికీకరణ అధ్వానంగా ఉందని గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్ లోధా అన్నారు. నాలుగు రోజుల క్రితం మంత్రి కేటీఆర్ ప్రారంభించిన ఎంజే మార్కెట్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.... 85 సంవత్సరాల నాటి ఎంజే మార్కెట్‌ను రూ.16 కోట్లు పెట్టి ఆధునికీకరించినా సమస్యలన్నీ అలాగే ఉన్నాయన్నారు. ఐదు రోజులపాటు కురిసిన వర్షాలకే ఎంజే మార్కెట్ వాన నీటితో నిండిపోవడం దారుణమన్నారు. ఎంజే మార్కెట్లో స్లాబ్‌కు రంద్రాలు పడటం, వర్షపు నీరు నిలిచిపోవడం చూస్తుంటే రూ.16 కోట్లు దేనికి ఖర్చు చేసినట్టు అని ఆయన ప్రశ్నించాడు. ఈ పనులపై జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ ప్రజలకు సమాధానం చెప్పాలని రాజాసింగ్ లోధా డిమాండ్ చేశారు. ప్రజల సొమ్ము వృథా చేయడం దారుణమన్నారు. -
గ్రూపిజం పెంచుతావా?
సాక్షి, అబిడ్స్ : బీజేపీ రాష్ట్ర కమిటీలో తాను చెప్పిన ఏ ఒక్కరికీ స్థానం కల్పించకపోవడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోధా ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మండిపడ్డారు. ఇంతకూ తెలంగాణలో బీజేపీని అభివృద్ధి చేస్తావా, గ్రూపిజం పెంచుతావా..? అని బండి సంజయ్‌ను ప్రశ్నించారు. ఆదివారం బండి సంజయ్ నూతన కమిటీ ప్రకటించడంతో అందులో గోషామహల్ నియోజకవర్గానికి చెందిన ఏ ఒక్కరికి స్థానం కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజాసింగ్ బండి సంజయ్‌కు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం లోనే తాను ఏకైక బీజేపీ ఎమ్మెల్యేనని, తన కు కనీసం బండి సంజయ్ గౌరవం ఇవ్వ లేదని ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. గోషామహల్ నియోజకవర్గంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని కనీసం తాను సిఫారసు చేసిన ఏ ఒక్కరికైనా పార్టీ లో పదవి ఇస్తే బాగుండేదని ఆయ న తెలిపారు. గ్రూప్ రాజకీయాలకు పుల్‌స్టాప్ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అభివృద్ధికి బండి సంజయ్ కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా అన్ని వర్గాలను కలుపుకుని పార్టీని బలోపేతం చేయాలని రాజాసింగ్ అన్నారు. -
విగ్రహం..వివాదం
అబిడ్స్ / జియాగూడ: ధూల్‌పేట, జుమ్మెరాత్‌బజార్‌లో బుధవారం అర్థరాత్రి స్వాతంత్య్ర సమరయోధురాలు రాణి అవంతిభాయి విగ్రహం ఏర్పా టు ఉద్రిక్తతకు దారి తీసింది. విగ్రహం ఏర్పాటుకు అనుమతి లేదంటూ షాహినాయత్‌గంజ్ పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులు, విగ్రహ ఏర్పాటుదారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బుధవారం అర్థరాత్రి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథాతో పాటు స్థానికులు చౌరస్తాలో రాణి అవంతీ భాయి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు వచ్చారు. 2009 లో అక్కడ ఏర్పాటు చేసిన చిన్న విగ్రహాన్ని తొలగించి పెద్ద విగ్రహాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నించారు. దీనిపై సమాచారం అందడంతో షాహినాయత్‌గంజ్ పోలీసులు, గోషామహాల్ ఏసీపీ నరేందర్‌రెడ్డి, ఆసీఫ్‌నగర్ ఏసీపీ నంద్యాల నర్సింహారెడ్డిలతో పాటు పలువురు ఉన్నతాధికారులు అక్కడికి వచ్చి విగ్రహ ఏర్పాటును అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే రాజాసింగ్, అతని అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అయితే పోలీసులు అడ్డుకున్నా ఎమ్మెల్యే, అతని అనుచరులు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేకు గాయం.... కాగా ఈ ఘటనలో ఎమ్మెల్యే రాజాసింగ్ లోథా తలకు గాయమైంది. చీకట్లో ఎమ్మెల్యేకు తలకు గాయం కావడంతో అతడిని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలీసులే తనపై దాడి చేశారని ఆరోపించారు. ఇలాంటి దాడులకు తాను భయపడేది లేదన్నారు. ఎమ్మెల్యే ఆరోపణలు అవాస్తవం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్.... ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు ఎలాంటి దాడి చేయలేదని వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఏసీగార్డ్స్‌లోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. రాజాసింగ్ లోథా చేతిలో రాయి ఉందన్నారు. ఆ రాయితో అతడే తలపై కొట్టుకుని ఉండవచ్చునన్నారు. పోలీసులు ఎందుకు దాడి చేస్తారని ప్రశ్నించారు. మీడియా ప్రతినిధులు సంఘటన వీడియో పుటేజీలను చూస్తే వాస్తవాలు వెల్లడవుతాయన్నారు. పోలీసులను ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరులు, స్థానికులు తోసివేశారన్నారు. ఎమ్మెల్యేతో పాటు పలువురిపై కేసులు నమోదు చేసినట్లు డీసీపీ వివరించారు. రాజాసింగ్‌కు మురళీధర్‌రావు, డాక్టర్ లక్ష్మణ్ పరామర్శ... గురువారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామ్‌చందర్‌రావు, వీహెచ్‌పీ సీనియర్ నాయకులు లచ్చుగుప్తా తదితరులు రాజాసింగ్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజాసింగ్‌పై దాడి దారుణమన్నారు. ఈ ఘటనను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఎమ్మెల్యేపై కేసులు నమోదు... ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు యోగేష్సింగ్, ప్రదీప్‌సింగ్, ఆనంద్‌సింగ్, రాజుసింగ్తో పాటు పలువురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, గోషామమాల్ ఏసీపీ నరేందర్‌రెడ్డి తెలిపారు. పోలీసులను అడ్డుకోవడం, పోలీసులపట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు విధులను అడ్డగించినందుకుగాను 143, 145, 147, 153 ఎ, 152, 353 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. -
‘చావడానికైనా చంపడానికైనా సిద్ధం’
హైదరాబాద్: ప్రతి ఒక్క భారతీయుడు పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని, దీనికి ప్రతి పౌరుడు చావడానికైనా, చంపడానికైనా సిద్ధంగా ఉండాలని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథా గద్గద స్వరంతో వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో అమరులైన సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ శుక్రవారం బీజేపీ, హిందూ వాహిణి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కె. లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజా సింగ్, హిందూ వాహిణి కార్యకర్తలు పాల్గొన్నారు. రాజా సింగ్ మాట్లాడుతూ.. ఉగ్రమూలాలు కూకటివేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే మోదీ కూడా సైనికులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని తెలిపారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రం పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 40 మంది జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. మరో 70 మంది జవాన్లు కూడా గాయపడ్డారు. -
ఆకలి చావులను పట్టించుకోని సీఎం
కేసీఆర్ తీరుకు నిరసనగా రాజీనామా చేస్తున్నా: రాజాసింగ్‌లోథా హైదరాబాద్: ధూల్‌పేట్‌లో గుడుంబా మానేసిన వేలాదిమంది ప్రత్యామ్నాయ ఉపాధి లేక ఆకలి చావులు చస్తున్నా సీఎం పట్టించుకోవడంలేదని గోషామహల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథా అన్నారు. కేసీఆర్ తీరుకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నానని.. ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు. మంగళవారం సీఎంను కలసి రాజీనామా లేఖను అందజేస్తానని చెప్పారు. రెండేళ్ల క్రితమే కేసీఆర్‌ను అసెంబ్లీలో తాను ప్రశ్నిస్తే ధూల్‌పేట్‌కు స్వయంగా వస్తానని, వారిని అన్ని విధాలా ఆదుకుంటానని హామీ ఇచ్చారని, అది నేటికీ నెరవేరలేదన్నారు ఎక్సైజ్ ఏఈఎస్ అంజిరెడ్డి ఆగడాలపై సీఎం, మంత్రి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని అన్నారు. సీఎం వెంటనే ధూల్‌పేట్‌ను సందర్శించి ఉపాధిలేని కుటుంబాలకు న్యాయం చేయాలని, లేకుంటే తన రాజీనామాను ఆమోదించాలని అన్నారు. -
'టెర్రరిస్టు పార్టీ సపోర్టుతో బంగారు తెలంగాణ ఎలా'
హైదరాబాద్: టెర్రరిస్టు పార్టీ సపోర్టుతో బంగారు తెలంగాణ ఎలా సాధ్యం అని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ ప్రశ్నించారు. టీఆర్ఎస్కు మిత్రపక్షం ఎంఐఎం.. ఎంఐఎంకు మిత్రపక్షం టెర్రరిస్టులు అని ఆయన ఎద్దేవా చేశారు. పాతబస్తీ మినీ పాకిస్తాన్లా తయారైందన్న రాజాసింగ్.. దీనిపై నాలుగురోజుల్లో హోం మంత్రి రాజనాథ్ సింగ్‌ను కలిసి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. కేసీఆర్‌కు హిందువులు ఓట్లేయలేదా అని ఆయన మండిపడ్డారు. ఒవైసీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి ఆయన్ని అరెస్ట్ చేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. -
‘కష్టించి పనిచేసేవారికే సముచిత స్థానం’
హైదరాబాద్: కష్టించి పనిచేసే వారికి బీజేపీలో సముచిత స్థానం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీలో క్రమ శిక్షణ గల కార్యకర్తగా మెలిగేవారికి ఉజ్వల భవిష్యత్‌ఉంటుందన్నారు. నూతనంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన కిషన్‌రెడ్డితోపాటు గోషామహాల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథలను బుధవారం రాత్రి దూల్పేట్ గంగాబౌలిలో లోథ క్షత్రియ సదర్ పంచాయతీ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్‌రెడ్డిమాట్లాడుతూ లోథ్ కులస్తుల త్యాగాలు ఎంతో అమోఘమన్నారు. రాజాసింగ్‌లోథను గెలిపించడంతో లోథ కులస్తుల పాత్ర మరువలేనిదన్నారు. మంగళ్‌హాట్, ధూల్‌పేట్ డివిజన్లలో ఉన్న వేలాది మంది లోథ కులస్తులు ఏకమై రాజాసింగ్ లోథ గెలుపుకు కారకులయ్యారన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాజాసింగ్‌లోథ మాట్లాడుతూ పది సంవత్సరాలుగా నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. ఆయన అభివృద్దిని విస్మరించినందునే సమస్యలు నియోజకవర్గంలో పేరుకు పోయాయన్నారు. అంచలంచెలుగా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడతానన్నారు. అత్యధిక మెజార్టీతో తనను గెలిపించిన గోషామహాల్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ప్రజలకు సేవలందిస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తూ వారి రుణాన్ని తీర్చుకుంటానన్నారు. అందుబాటులో ఉండి అభివృద్ధి చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తానని రాజాసింగ్‌లోథ పేర్కొన్నారు.