ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజాసింగ్ లోథా రాణి అవంతీభాయి విగ్రహం
అబిడ్స్ / జియాగూడ: ధూల్‌పేట, జుమ్మెరాత్‌బజార్‌లో బుధవారం అర్థరాత్రి స్వాతంత్య్ర సమరయోధురాలు రాణి అవంతిభాయి విగ్రహం ఏర్పా టు ఉద్రిక్తతకు దారి తీసింది. విగ్రహం ఏర్పాటుకు అనుమతి లేదంటూ షాహినాయత్‌గంజ్ పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులు, విగ్రహ ఏర్పాటుదారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బుధవారం అర్థరాత్రి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథాతో పాటు స్థానికులు చౌరస్తాలో రాణి అవంతీ భాయి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు వచ్చారు. 2009 లో అక్కడ ఏర్పాటు చేసిన చిన్న విగ్రహాన్ని తొలగించి పెద్ద విగ్రహాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నించారు. దీనిపై సమాచారం అందడంతో షాహినాయత్‌గంజ్ పోలీసులు, గోషామహాల్ ఏసీపీ నరేందర్‌రెడ్డి, ఆసీఫ్‌నగర్ ఏసీపీ నంద్యాల నర్సింహారెడ్డిలతో పాటు పలువురు ఉన్నతాధికారులు అక్కడికి వచ్చి విగ్రహ ఏర్పాటును అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే రాజాసింగ్, అతని అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అయితే పోలీసులు అడ్డుకున్నా ఎమ్మెల్యే, అతని అనుచరులు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యేకు గాయం....
కాగా ఈ ఘటనలో ఎమ్మెల్యే రాజాసింగ్ లోథా తలకు గాయమైంది. చీకట్లో ఎమ్మెల్యేకు తలకు గాయం కావడంతో అతడిని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలీసులే తనపై దాడి చేశారని ఆరోపించారు. ఇలాంటి దాడులకు తాను భయపడేది లేదన్నారు.
ఎమ్మెల్యే ఆరోపణలు అవాస్తవం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్....
ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు ఎలాంటి దాడి చేయలేదని వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఏసీగార్డ్స్‌లోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. రాజాసింగ్ లోథా చేతిలో రాయి ఉందన్నారు. ఆ రాయితో అతడే తలపై కొట్టుకుని ఉండవచ్చునన్నారు. పోలీసులు ఎందుకు దాడి చేస్తారని ప్రశ్నించారు. మీడియా ప్రతినిధులు సంఘటన వీడియో పుటేజీలను చూస్తే వాస్తవాలు వెల్లడవుతాయన్నారు. పోలీసులను ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరులు, స్థానికులు తోసివేశారన్నారు. ఎమ్మెల్యేతో పాటు పలువురిపై కేసులు నమోదు చేసినట్లు డీసీపీ వివరించారు.
రాజాసింగ్‌కు మురళీధర్‌రావు, డాక్టర్ లక్ష్మణ్ పరామర్శ...
గురువారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామ్‌చందర్‌రావు, వీహెచ్‌పీ సీనియర్ నాయకులు లచ్చుగుప్తా తదితరులు రాజాసింగ్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజాసింగ్‌పై దాడి దారుణమన్నారు. ఈ ఘటనను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామన్నారు.
ఎమ్మెల్యేపై కేసులు నమోదు...
ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు యోగేష్‌సింగ్, ప్రదీప్‌సింగ్, ఆనంద్‌సింగ్, రాజుసింగ్‌తో పాటు పలువురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, గోషామమాల్ ఏసీపీ నరేందర్‌రెడ్డి తెలిపారు. పోలీసులను అడ్డుకోవడం, పోలీసులపట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు విధులను అడ్డగించినందుకుగాను 143, 145, 147, 153 ఎ, 152, 353 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment