
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ పార్టీ ఆ రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఎవరిని నియమించాలనే విషయంపై కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ ఉపన్యాసం ముగిసిన వెంటనే కేంద్ర పార్లమెంటరీ బోర్డు ఈ మేరకు సమావేశం అయింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ, రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రెండు పరిశీలక బృందాలు ఏర్పాటుచేశారు. జైట్లీ బృందం గుజరాత్ వెళ్లనుండగా, సీతారామన్ బృందం షిమ్లాకు వెళ్లింది. వీరి పరిశీలన పూర్తయ్యాక ఆ విషయాన్ని కేంద్రంలోని పెద్దలకు చెప్పిన తర్వాత తిరిగి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోదీ నిర్ణయం తీసుకోనున్నారు.
దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ 'రెండు రాష్ట్రాలకు రాబోయే కొత్త ముఖ్యమంత్రులు ఎవరనేది జైట్లీ, రామన్ బృందాలు పరిశీలిస్తాయి. ఆ బృందాలు ఆయా రాష్ట్రాలకు వెళ్లి ఈ ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యి ముఖ్యమంత్రి అంశాన్ని చర్చించి వారి అభిప్రాయాలను సేకరిస్తాయి. ఆ వివరాలను కేంద్రంలో పెద్దలకు తెలియజేసిన తర్వాత ముఖ్యమంత్రులు ఎవరనేది నిర్ణయిస్తారు' అని చెప్పారు. తొలుత హిమాచల్ ప్రదేశ్‌కు పీకే దుమాల్ ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించినప్పటికీ ఆయన ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో జేపీ నడ్డాను ముఖ్యమంత్రిగా చేస్తారని ఓ చర్చ బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment