
సాక్షి, హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యుడు బద్దం బాల్‌రెడ్డి కన్నుమూశారు. బంజరాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కార్వాన్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు బద్దం బాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పాతబస్తీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన బద్దం బాల్‌రెడ్డిని అభిమానులు గోల్కొండ టైగర్‌గా పిలుచుకొనేవారు. పాతబస్తీ అలియాబాద్ జంగమ్మెట్ ప్రాంతానికి చెందిన ఆయన ఓల్డ్‌సిటీలో బీజేపీ బలోపేతానికి విశేషమైన కృషి చేశారు.
అప్పట్లో ఎంఐఎం వ్యవస్థాపకుడు సలావుద్దీన్ ఓవైసీకి పాతబస్తీలో ఆయన గట్టిపోటీ ఇచ్చారు. హైదరాబాద్‌లో, తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అభివృద్ధి చేసేందుకు కృషి చేసిన నాయకుల్లో బద్దం బాల్‌రెడ్డి ఒకరు. ఆయన పేరును పలుమార్లు గవర్నర్ పదవికి బీజేపీ అధిష్టానం పరిశీలించింది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి బీజేపీ తరఫున ఆయన పోటీ చేశారు. బాల్‌రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.