baddam Ball Reddy
-
బద్దం బాల్రెడ్డికి అంతిమ వీడ్కోలు
హైదరాబాద్: అశేష జనవాహిని అశ్రునయనాల మధ్య బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్‌రెడ్డి అంత్యక్రియలను ఆదివారం సాయంత్రం రాయదుర్గంలోని వైకుంఠ మహాప్రస్థానంలో నిర్వహించారు. శాస్త్రయుక్తంగా నిర్వహించిన కార్యక్రమం అనంతరం చితికి ఆయన పెద్ద కుమారుడు నిప్పంటించారు. బద్దం బాల్‌రెడ్డి అంతిమయాత్ర బంజారాహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి బీజేపీ కార్యాలయానికి, అక్కడి నుంచి మెహిదీపట్నం, టోలిచౌకి, షేక్‌పేట్, రాయదుర్గం మీదుగా వైకుంఠ మహాప్రస్థానం వరకు కొనసాగింది. వేలాదిగా విచ్చేసిన జనం ఆయన కడసారి చూపు కోసం తెల్లవారుజాము నుంచే ఇంటి వద్ద బారులు తీరారు. తెలంగాణ రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, మాజీ హోం మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జానారెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యేలు జి.కిషన్‌రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, మాజీ మంత్రులు ఎంవి.మైసూరారెడ్డి, డీకే సమరసింహారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, నాయకులు ఎగ్గె మల్లెశం, ఎంఎస్ ప్రభాకర్ తదితరులు బద్దం భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. -
నగరంపై చెరగని తిలకం
సాక్షి, హైదరాబాద్: నుదిట తిలకం, భుజాల పై శాలువా, గంభీరమైన రూపంతో దర్శనమిచ్చే బద్దం బాల్‌రెడ్డి నగర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. సమస్య ఏదైనా, అవతలి వర్గంవారు ఎవరైనా తన వద్దకు వచ్చి విన్నవించినవారికి పూర్తి భరోసా కల్పించి బద్దం తనదైన ప్రత్యేకతను నిలుపుకున్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం నిలబడిననేత ఆయన. పాతబస్తీలో పుట్టి, జన్‌సంఘ్‌లో పెరిగి న ఆయన నగరంలో ఎంఐఎంకు రాజకీయప్రత్యర్థిగా తొడగొట్టి నిలబడ్డారు. 1978లో ఆయనపై దాడి జరిగింది. ఆయన్ను హతమార్చేందుకు కుట్ర పన్నిన ఉగ్రవాదులను 2017లో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఆయనను ‘గోల్కొండ సింహం’గా పార్టీ కార్యకర్తలు, అభిమానులు పిలుచుకునేవారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ పోరాడేతత్వంతో ఉండే ఆయన 1991,1998, 1999లో హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంఐఎంకు ముచ్చెమటలు పట్టించారు. 1991లో ఎంఐఎం అభ్యర్థి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ చేతిలో 39,524 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో ఎంఐ ఎంకు ఇదే అతితక్కువ మెజారిటీ. కార్వాన్లో జైత్రయాత్ర పాతబస్తీ అలియాబాద్‌లో బాల్‌రెడ్డి పుట్టి పెరిగారు. కానీ, కార్వాన్ అసెంబ్లీ స్థానం నుంచి శాసనసభ్యుడిగా హ్యాట్రిక్ విజయాలు సాధించారు. ఎంఐఎం అభ్యర్థులను ఓడించారు. 1985లో కార్వాన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 9,777 ఓట్ల మెజారిటీతో విరాసత్ రసూల్‌ఖాన్‌పై, 1989లో 3,066 ఓట్ల మెజా రిటీతో ఆకర్ ఆగాపై, 1994లో 13,293 ఓట్ల మెజా రిటీతో సయ్యద్ సజ్జాద్‌పై విజయం సాధించారు. తదనంతరం ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. అయినా కార్వాన్ నియోజకవర్గాన్ని వదలకుండా 2014 వరకు పోటీ చేశారు. 2009లో చేవెళ్ల లోక్‌సభ, ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో రాజేంద్రనగర్ శాసనసభ స్థానాల నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆరోగ్యం సహకరించకున్నా వీధివీధిలో తిరిగి ప్రచారం నిర్వహించారు. బెదిరింపులు వచ్చినా.. 1978లో అలియాబాద్ సమీపంలో స్కూటర్‌పై బాధితుల పరామర్శకు వస్తున్న బాల్‌రెడ్డిపై దుండగులు దాడి చేశారు. తదనం తరం కూడా అనేక సందర్భాల్లో హతమారుస్తాం అంటూ పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ దేశాల నుంచి ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయినా ఆయన మొక్కవోని దీక్షతో సిద్ధాంత రాజకీయాల్లో కొనసాగారు. బాల్‌రెడ్డి హత్యకు పన్నిన కుట్రను భగ్నం చేసిన ఎన్ఐఏ 2017లో పలువురిని అరెస్ట్ చేసింది. బెదిరింపులు వచ్చి నా కూడా బద్దం ఎక్కడా వెనక్కి వెళ్లిన దాఖలా ల్లేవని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. -
బద్దం బాల్‌రెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: కొంతకాలంగా తీవ్ర అనా రోగ్యంతో బాధపడుతున్న కార్వాన్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్‌రెడ్డి(74) శనివారం సాయంత్రం ఇక్కడి కేర్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా చిన్నపేగు కేన్సర్‌తో బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం ఈ నెల 10న కుటుంబసభ్యులు ఆయనను బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 12న ఆయనకు వైద్యులు ఆపరేషన్ చేశారు. ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడటంతో ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించారు. అప్పటికే కేన్సర్ కణాలు కాలేయంసహా ఇతర ముఖ్యమైన భాగాలకు విస్తరించడం, ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడం, శ్వాస సరిగా తీసుకోలేకపోతుండటంతో రెండురోజుల క్రితం మళ్లీ ఐసీయూకు తరలించారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న బాల్‌రెడ్డిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సలు అందించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సహా పలువురు నేతలు ఆస్పత్రికి చేరుకుని ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. 1945 మార్చి 7న పాతబస్తీలోని అలియాబాద్‌లో జన్మించిన బద్దం బాల్రెడ్డికి భార్య యాదమ్మసహా కుమార్తె అరుణ, కుమారులు గోపాల్‌రెడ్డి, శివపాల్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి ఉన్నారు. ఆయన భౌతికకాయాన్ని అశ్రునయనాల మధ్య ఆసుపత్రి నుండి బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని ఇంటికి తరలించారు. అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. పార్టీ కార్యాలయంలో బద్దం పార్థివదేహం బాల్‌రెడ్డి పార్థివదేహాన్ని బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో ఆదివారం 12 గంటల వరకు, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం ఉంచుతారని పార్టీ నేతలు తెలిపారు. తర్వాత పార్టీ కార్యాలయం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర సాగుతుందని పేర్కొన్నారు. బాల్‌రెడ్డి మృతి పట్ల సీఎం సంతాపం బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజాజీవితంలో బాల్‌రెడ్డి చేసిన సేవలు ఎనలేనివని ఒక ప్రకటనలో కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిద్ధాంతపరమై రాజకీయాలకు అంకితమయ్యారు: దత్తాత్రేయ బాల్‌రెడ్డి మరణం తెలుగు ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు తీరనిలోటని కేంద్ర మాజీమంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ భావజాలాన్ని పునికి పుచ్చుకొని జీవితమంతా సిద్ధాంతపరమైన రాజకీయాలకు అంకితమై పనిచేశారన్నారు. క్రమశిక్షణ కలిగిన నేత: లక్ష్మణ్ బాల్‌రెడ్డి మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన బాల్యం నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేశారని తెలిపారు. బీజేపీ శాసనసభాపక్ష నాయకునిగా అనేక ప్రధాన సమస్యలను సభలో లేవనెత్తారని పేర్కొన్నారు. బాల్‌రెడ్డి మరణం బీజేపీకి తీరని లోటని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఎమ్మెల్సీ ఎన్.రాంచంద్రరావు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన పోరాటం చేశారని కొనియాడారు. కాంగ్రెస్ నేతల సంతాపం సాక్షి, హైదరాబాద్: మాజీ శాసనసభ్యులు బద్ధం బాల్‌రెడ్డి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ సీఎల్పీ నేత కె.జానారెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, టీపీసీసీ ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ గోపిశెట్టి నిరంజన్ సంతాపం ప్రకటించారు. రాజకీయాల్లో నైతిక విలువలు పాటించిన నాయకుడు బాల్‌రెడ్డి అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారు భగవంతున్ని ప్రార్థించారు. -
బద్దం బాల్‌రెడ్డి కన్నుమూత
-
బద్దం బాల్‌రెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత, మాజీ శాసనసభ్యుడు బద్దం బాల్‌రెడ్డి కన్నుమూశారు. బంజరాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కార్వాన్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు బద్దం బాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పాతబస్తీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన బద్దం బాల్‌రెడ్డిని అభిమానులు గోల్కొండ టైగర్‌గా పిలుచుకొనేవారు. పాతబస్తీ అలియాబాద్ జంగమ్మెట్ ప్రాంతానికి చెందిన ఆయన ఓల్డ్‌సిటీలో బీజేపీ బలోపేతానికి విశేషమైన కృషి చేశారు. అప్పట్లో ఎంఐఎం వ్యవస్థాపకుడు సలావుద్దీన్ ఓవైసీకి పాతబస్తీలో ఆయన గట్టిపోటీ ఇచ్చారు. హైదరాబాద్‌లో, తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అభివృద్ధి చేసేందుకు కృషి చేసిన నాయకుల్లో బద్దం బాల్‌రెడ్డి ఒకరు. ఆయన పేరును పలుమార్లు గవర్నర్ పదవికి బీజేపీ అధిష్టానం పరిశీలించింది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి బీజేపీ తరఫున ఆయన పోటీ చేశారు. బాల్‌రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. -
నగరానికి గోదావరి నీళ్లు తేవాలి: బద్దం
హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి కృష్ణా నది నీరు సరిపోనందున గోదావరి నుంచి నీటి తీసుకురావాలని బీజేపీ నేత బద్దం బాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఏడాదికి రూ.300-500 కోట్లు ఖర్చు చేస్తున్నా నగరానికి నీటిని తీసుకొచ్చే ప్రాజెక్టుల పనితీరు ఆశాజనకంగా లేదన్నారు. రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు నల్లా ద్వారా నీళ్లు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని చెబుతున్న సీఎం కేసీఆర్, 2019 కల్లా ఎన్ని ఇళ్లకు రోజూ నీళ్లు సరఫరా చేస్తారో చెప్పాలన్నారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ వాటర్‌వర్క్స్ డిపార్ట్మెంట్లో అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ శాఖలో అవినీతి అధికారులను ప్రోత్సహిస్తున్నారని, వారికే ప్రమోషన్లు ఇచ్చి అందలాలు ఎక్కిస్తున్నారని ఆరోపించారు.