సాక్షి, హైదరాబాద్: కొంతకాలంగా తీవ్ర అనా రోగ్యంతో బాధపడుతున్న కార్వాన్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్‌రెడ్డి(74) శనివారం సాయంత్రం ఇక్కడి కేర్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా చిన్నపేగు కేన్సర్‌తో బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం ఈ నెల 10న కుటుంబసభ్యులు ఆయనను బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 12న ఆయనకు వైద్యులు ఆపరేషన్ చేశారు. ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడటంతో ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించారు. అప్పటికే కేన్సర్ కణాలు కాలేయంసహా ఇతర ముఖ్యమైన భాగాలకు విస్తరించడం, ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడం, శ్వాస సరిగా తీసుకోలేకపోతుండటంతో రెండురోజుల క్రితం మళ్లీ ఐసీయూకు తరలించారు.
మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న బాల్‌రెడ్డిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సలు అందించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సహా పలువురు నేతలు ఆస్పత్రికి చేరుకుని ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. 1945 మార్చి 7న పాతబస్తీలోని అలియాబాద్‌లో జన్మించిన బద్దం బాల్‌రెడ్డికి భార్య యాదమ్మసహా కుమార్తె అరుణ, కుమారులు గోపాల్‌రెడ్డి, శివపాల్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి ఉన్నారు. ఆయన భౌతికకాయాన్ని అశ్రునయనాల మధ్య ఆసుపత్రి నుండి బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని ఇంటికి తరలించారు. అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.
పార్టీ కార్యాలయంలో బద్దం పార్థివదేహం
బాల్‌రెడ్డి పార్థివదేహాన్ని బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో ఆదివారం 12 గంటల వరకు, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం ఉంచుతారని పార్టీ నేతలు తెలిపారు. తర్వాత పార్టీ కార్యాలయం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర సాగుతుందని పేర్కొన్నారు.
బాల్‌రెడ్డి మృతి పట్ల సీఎం సంతాపం
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజాజీవితంలో బాల్‌రెడ్డి చేసిన సేవలు ఎనలేనివని ఒక ప్రకటనలో కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సిద్ధాంతపరమై రాజకీయాలకు అంకితమయ్యారు: దత్తాత్రేయ
బాల్‌రెడ్డి మరణం తెలుగు ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు తీరనిలోటని కేంద్ర మాజీమంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ భావజాలాన్ని పునికి పుచ్చుకొని జీవితమంతా సిద్ధాంతపరమైన రాజకీయాలకు అంకితమై పనిచేశారన్నారు.
క్రమశిక్షణ కలిగిన నేత: లక్ష్మణ్
బాల్‌రెడ్డి మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన బాల్యం నుంచి ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా పనిచేశారని తెలిపారు. బీజేపీ శాసనసభాపక్ష నాయకునిగా అనేక ప్రధాన సమస్యలను సభలో లేవనెత్తారని పేర్కొన్నారు. బాల్‌రెడ్డి మరణం బీజేపీకి తీరని లోటని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఎమ్మెల్సీ ఎన్.రాంచంద్రరావు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన పోరాటం చేశారని కొనియాడారు.
కాంగ్రెస్ నేతల సంతాపం
సాక్షి, హైదరాబాద్: మాజీ శాసనసభ్యులు బద్ధం బాల్‌రెడ్డి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ సీఎల్పీ నేత కె.జానారెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, టీపీసీసీ ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ గోపిశెట్టి నిరంజన్ సంతాపం ప్రకటించారు. రాజకీయాల్లో నైతిక విలువలు పాటించిన నాయకుడు బాల్‌రెడ్డి అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారు భగవంతున్ని ప్రార్థించారు.
Comments
Please login to add a commentAdd a comment