బీజేవైఎం ఏపీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి(పాత చిత్రం)
హైదరాబాద్: ఏపీలో టీడీపీ ప్రభుత్వం అబద్ధాల మీద పాలన సాగిస్తోందని బీజేవైఎం ఏపీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాయలంలో విలేకరులతో మాట్లాడుతూ..కడప ఉక్కు పరిశ్రమ విషయంలో ఏపీ ప్రజలను, ముఖ్యంగా రాయలసీమ ప్రాంత ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ మోసానికి పాల్పడుతోందని అన్నారు. ఉక్కు పరిశ్రమపై గతంలో నాలుగు సార్లు సమావేశం పెట్టాం..కానీ టీడీపీ ప్రభుత్వం రాయలసీమలో ఉక్కు పరిశ్రమ పెట్టకూడదని అనుకుంటుందని ఆరోపించారు.
ఉక్కు పరిశ్రమ విషయంలో టీడీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డితో కలిసి కోర్టులో కేసు కూడా వేశారు..ఈ మధ్య సీఎం రమేశ్‌తో దీక్ష చేయించారని వ్యాఖ్యానించారు. బరువు తగ్గాలంటే దీక్షలు చేయాలని ఈ నడుమ టీడీపీ ఎంపీలు కూడా ఢిల్లీలో కూడా మాట్లాడుకుంటున్నారని వెల్లడించారు. ఏపీ ప్రజల మనోభావాలను దెబ్బతీసి ఇలాంటి దొంగ దీక్షలు చేస్తారా అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీ వేసి 10 సార్లు ఢిల్లీ వెళ్లింది.. కానీ టీడీపీ ఇప్పటి వరకు ఇలాంటి ప్రయత్నం చేసిందా అని సూటిగా అడిగారు. టీడీపీ నేతలకు నిజాయితీ ఉంటే సక్రమంగా ప్రయత్నించాలి..ఉక్కు పరిశ్రమకు కేంద్రమే రూ.20 వేల కోట్లు ఇస్తుందని తెలిపారు.
కానీ టీడీపీ నేతలు తుక్కు పరిశ్రమ కోసం ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో ప్రతిపక్షాలు తిరిగే పరిస్థితి లేదని, రాష్ట్రపతి పాలన తీసుకురావాల్సిన అవసరం కనబడుతోందని వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులపై ఏపీలో దాడులు జరుగుతున్నాయని, ఈ విషయమై బీజేపీ బృందం మంగళవారం గవర్నర్‌ని కలుస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు సిద్ధం అవుతుంది.. కానీ ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. టీడీపీ పాలన బాగుందని చెప్పుకుంటున్నారు కదా పంచాయతీ ఎన్నికలపై ఎందుకు పారిపోతున్నారని సూటిగా ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment