
బెంగళూర్ : కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప అసెంబ్లీలో సోమవారం విశ్వాస పరీక్షను ఎదుర్కొంటున్న క్రమంలో యడ్డీకి చెక్ పెట్టేందుకు చిట్టచివరి అస్త్రాలకు కాంగ్రెస్ పదును పెట్టింది. యడియూరప్పను సవాల్ చేసే ఎలాంటి చిన్న అవకాశాన్ని విడిచిపెట్టని కాంగ్రెస్ విశ్వాస పరీక్షకు ముందు పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించింది. ఫిరాయింపు నిరోధక చట్టం కింద కాంగ్రెస్-జేడీఎస్‌కు చెందిన 14 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేసిన నేపథ్యంలో సీఎల్పీ భేటీ జరగడం గమనార్హం.
అనర్హత వేటుకు గురైన నేతలు ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగిసేవరకూ ఎన్నికల్లో పోటీ చేసే వెసులుబాటు ఉండదు. మరోవైపు తమపై స్పీకర్ అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని రెబెల్ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. కాగా బలపరీక్షలో నెగ్గితీరుతామని సీఎం యడియూరప్ప ధీమా వ్యక్తం చేశారు. బలపరీక్షలో నెగ్గిన అనంతరం గత ప్రభుత్వం రూపొందించిన ఫైనాన్స్ బిల్లును సభ ముందుంచుతామని చెప్పారు.
ఇక పార్టీకి చెందిన 105 మంది ఎమ్మెల్యేలతో పాటు ఒకరిద్దరి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు సైతం తమకు మద్దతు ఇస్తారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ పేర్కొన్నారు. ఫైనాన్స్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఆయన జేడీఎస్, కాంగ్రెస్‌లను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment