
సాక్షి, బెంగళూరు : రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్, మాజీ సీఎం యెడియూరప్ప శుక్రవారం ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. పార్టీ శ్రేణులు వెంటరాగా ర్యాలీగా రాజ్‌భవన్‌కు చేరుకున్న యెడియూరప్ప చేత.. గవర్నర్ వాజూభాయ్ వాలా ప్రమాణ స్వీకారం చేయించారు. తద్వారా ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే బీజేపీ బలనిరూపణ చేసుకున్న తర్వాతే మంత్రివర్గ కూర్పు జరుగనుంది. ప్రస్తుతం బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉండగా కాంగ్రెస్- జేడీఎస్ కూటమికి 99 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న సంగతి తెలిసిందే.
ఇక ప్రమాణ స్వీకారోత్సవానికి కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు, కాంగ్రెస్ అసంతృప్త నేత రోషన్ బేగ్ తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ కార్యక్రమాన్ని బహిష్కరించింది. ఇక ప్రమాణస్వీకారం నేపథ్యంలో జ్యోతిష్కుడి సలహా మేరకు యడ్యూరప్ప తన పేరును యెడియూరప్పగా మార్చుకున్న విషయం తెలిసిందే.
ఇక 2007లో మొదటిసారి, 2008లో రెండోసారి, 2018లో మూడోసారి, ఇప్పుడు నాలుగోసారి యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. అయితే, గతంలో మూడుసార్లు ఆయన పూర్తికాలం పదవిలో కొనసాగలేకపోయారు. మరోవైపు ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆర్.శంకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రమేష్ జార్జ్‌హోళి, మహేష్... 2023 వరకూ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేశారు. 2023 వరకు వారు పోటీ చేయడానికి కూడా వారిని అనర్హులుగా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment