మాట్లాడుతున్నడోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
బేతంచెర్ల: రాష్ట్రంలో ప్రస్తుతం అవినీతి పాలన సాగుతోందని పీఏసీ చైర్మన్ డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు స్థానిక ప్రజా ప్రతినిధులను పక్కనబెట్టి జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి వారి ద్వారా ప్రజా ధనాన్ని లూటీ చేయిస్తున్నారని మండిపడ్డారు. గురువారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీపీ గజ్జి కిట్టమ్మ, గ్రామ సర్పంచ్ బొద్దుల రోజమ్మ ఆధ్వర్యంలో వివిధ శాఖల మండల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. రేషన్ కార్డు, పింఛన్, ఇల్లు, రుణం మంజూరు కావలంటే జన్మభూమి కమిటీలను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.
ప్రభుత్వ పథకాల మంజూరులో వారి పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. ప్రస్తుతం అధికారులు, ప్రజా ప్రతి నిధులకు ఎలాంటి అధికారాలు లేవన్నారు. తాము ప్రతి పక్షంలో ఉండి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. అందులో భాగంగా సిమెంట్‌నగర్‌కు 5 అంగన్‌వాడీ బిల్డింగులు, అంబాపురం–1, తవిసికొండ–1, బలపాలపల్లె–1 మంజూరు చేయించామన్నారు. బేతంచెర్లలో ఉన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి బనగానపల్లె రైల్వే గేటు నుంచి సంజీవనగర్, హనుమాన్‌నగర్, సరస్వతీ శిశశుమందిర్ ఉన్నత పాఠశాల , పలక చింత మాను ఆంజనేయ స్వామి ఆలయం వరకు డబుల్ రోడ్డు, అలాగే స్టేట్ బ్యాంకు సమీపం నుంచి కొలుముల పల్లె రహదారి నిర్మాణం చేపడుతున్నామన్నారు. అంబాపురం, హెచ్ కొట్టాల, సిమెంట్‌నగర్ గ్రామాల్లో తాగునీటి పథకాలకు నిధులు మంజూరు చేయించామన్నారు. జంగాల పేట కాలనీ సమీపాన ఉన్న చెత్త దిబ్బను తొలగించాలని విన్నవిస్తున్నా అధికారులు పట్టించు కోవడం లేదని ఎంపీటీసీ సుబ్బరాయుడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఈసమస్య పరిష్కరించాలని పంచాయతీ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. అందరి సహకారంతో బేతంచెర్ల ఉత్తమ పంచాయతీ అవార్డు అందుకోవడం అనందంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment