సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల రెండోవిడత పోలింగ్‌కు ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. ఏప్రిల్ 18న 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో విస్తరించిన 97 నియోజకవర్గాల్లో మలి విడత పోలింగ్ జరగనుంది. తమిళనాడులో మొత్తం 39 లోక్‌సభ నియోజకవర్గాల్లో రెండో దశలో పోలింగ్ జరగనుంది. ఇక కర్నాటకలో 14 లోక్‌సభ స్ధానాల్లో, మహారాష్ట్రలో 10, యూపీలో 8, అసోం, బిహార్, ఒడిసాల్లో ఐదేసి నియోజకవర్గాలు, చత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌లో మూడు, జమ్మూ కశ్మీర్‌లో రెండు, మణిపూర్, త్రిపుర, పుదుచ్చేరిల్లో ఒక్కో నియోజకవర్గంలో 18న పోలింగ్ జరగనుంది.
తమిళనాడులో ఒకేసారి అన్ని నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతున్న క్రమంలో ఆ రాష్ట్రంలో ధనప్రవాహం అధికంగా ఉన్నట్టు గుర్తించిన ఈసీ ధన ప్రభావానికి చెక్ పెట్టేందుకు పలు చర్యలు చేపట్టింది. రెండో విడత పోలింగ్‌లో ఓటర్లను ఆకట్టుకునేందుకు పలు రాజకీయ పార్టీలు దిగ్గజ నేతలతో పాటు తమ స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారాన్ని హోరెత్తించాయి.
ప్రచారానికి చివరిరోజు కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఒడిశా, చత్తీస్‌గఢ్‌లో పలు ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కేరళలో పలు ప్రచార సభల్లో పాల్గొన్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 115 నియోజకవర్గాల్లో ఈనెల 23న మూడో విడత పోలింగ్ జరగనుండటంతో అగ్రనేతలు ఆయా నియోజకవర్గాల్లో ప్రచారంపై దృష్టి సారించారు.
Comments
Please login to add a commentAdd a comment