కర్నూలు, బనగానపల్లె: జిల్లాలో టీడీపీకి కోలుకోలేని దెబ్బతగలింది. ఆ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. అలాగే పార్టీ సభ్యత్వాన్ని వదులకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఫాక్స్ ద్వారా లేఖ పంపారు. వైఎస్సార్‌సీపీలో చేరేందుకు చల్లా సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో అధికార పార్టీకి షాక్ తగిలింది. కొంతకాలంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వలసల పరంపర కొనసాగుతుండడంతో టీడీపీ ఉనికి కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో సోమవారం చల్లా రామకృష్ణారెడ్డి టీడీపీ సభ్యత్వానికి, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా సమర్పించడంతో అధికార పార్టీకి గట్టి దెబ్బతగిలింది. చల్లా కుటుంబం ఐదు దశాబ్దాలుగా జిల్లాలో ప్రాముఖ్యత సంతరించుకున్న విషయం విదితమే. చల్లా రామకృష్ణారెడ్డి తండ్రి చల్లా చిన్నపురెడ్డి మంచి నాయకుడిగా ప్రజల్లో పేరుగాంచారు. చల్లా సోదరులు సైతం ప్రజల్లో అదే అభిమానం, గౌరవాన్ని కలిగి ఉన్నారు. ప్రజాభిమానంతో 1983లో పాణ్యం నుంచి 1999, 2004లో కోవెలకుంట్ల నియోజకవర్గం నుంచి చల్లా రామకృష్ణారెడ్డి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
సముచిత స్థానం లభించనందునే..
బనగానపల్లె నియోజకవర్గంలో ఓటు బ్యాంక్ కలిగి ఉన్న చల్లా రామకృష్ణారెడ్డి.. 2014 శాసనసభ ఎన్నికల్లో బీసీ జనార్దన్‌రెడ్డి గెలుపునకు కృషి చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత.. చల్లాకు ఇచ్చిన వాగ్దానాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చలేకపోయారు. ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి కూడా సముచిత స్థానం కల్పించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అవుకు మండలంలో సీఎం చంద్రబాబు పర్యటించిన సందర్భంగా చల్లాకు తగిన గౌరవం ఇవ్వలేదన్నవిషయం అప్పట్లో చర్చనీయాంశమైంది. మంత్రి హోదాలో నారా లోకేష్ అవుకులోని పర్యటన చేస్తున్న సమయంలోను మర్యాదపూర్వకంగా పిలవకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఎమ్మెల్యే బీసీతో విభేదాలు పొడచూపాయని గ్రహించిన సీఎం చంద్రబాబు..కడప ఆర్టీసీ రీజినల్ చైర్మన్ పదవిని ఇవ్వగా , అది తన స్థాయికి తగదని బహిరంగంగానే చల్లా సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడంతో.. తను నమ్ముకున్న నాయకులు, కార్యకర్తల కోసం కొన్ని నెలల పాటు చేపట్టారు.
కొసమెరుపు..
సముచిత స్థానం కల్పించకపోవడంతో పార్టీకి, పదవికి చల్లా రాజీనామా చేసినట్లు తెలుసుకున్న ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి.. సోమవారం అవుకు పట్టణానికి వెళ్లారు. అక్కడ ఉన్న చల్లా సోదరులను కలిశారు. అయితే తాము కూడా అన్నబాటలోనే పయనిస్తామని తేల్చిచెప్పడంతో చేసేదేమీ లేక వెనుదిరిగి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment