సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబ అధికార పీఠం పదిలం చేసుకోవడం కోసమే రైతుబంధు పేరిట రైతులను ముంచుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికలొచ్చినప్పుడల్లా ఓట్లు దండుకోవడం కోసం టీఆర్‌ఎస్ జిమ్మిక్కుల పథకాలు రూపొందిస్తుందని, రైతుల ఓట్ల కోసం రైతుబంధు పథకాన్ని సృష్టించారని విమర్శించారు. రైతాంగాన్ని అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి సీఎంకి ఉంటే ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం ఈ ఏడాది వర్షాకాలానికి 5వ విడత 59 లక్షల 30 వేల మంది రైతులుంటే కేవలం 50 లక్షల 84 వేల మందికి రైతుబంధు డబ్బులను చెల్లించి మిగతా 8 లక్షల 46 వేల మంది రైతుల నోట్లో మట్టి ఎందుకు కొట్టిందని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2వ విడతలో 5 లక్షల 43 వేలు, 3వ విడతలో 5 లక్షల 21 వేలు, 4వ విడతలో 17 లక్షల 80 వేలు, 5వ విడతలో 8 లక్షల 46 వేలు కలిపి మొత్తం 36 లక్షల 90 వేల మంది రైతులకు డబ్బులు చెల్లించలేదని లెక్కలు చెప్పారు. ఈ ఏడాది 5వ విడత రైతుబంధు కింద రూ.7 వేల కోట్లు అవసరమైతే, కేవలం 5,294 కోట్లు మాత్రమే విడుదల చేశారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment