
వైవీయూ (వైఎస్‌ఆర్ జిల్లా) : కేసుల భయంతో చంద్రబాబు ఆదేశాల మేరకే టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య అన్నారు. గురువారం వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు తన పదవీ కాలంలో చేసిన వికృత చర్యల వల్ల ప్రజాభిమానం కోల్పోయి ఘోర పరాజయం పొందాడన్నారు. అయితే ఆయన హయాంలో జరిగిన విచ్చలవిడి అవినీతి, అక్రమాలపై విచారణ చేపడితే తనకు శిక్ష ఖాయమని భావించి టీడీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపించి తనపై కేసులు లేకుండా ఉండేలా ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
ఆర్థిక నేరగాళ్లు, బ్యాంకులను లూటీ చేసినవారు, స్మగ్లర్లు తన అనుయాయులైన టీడీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపించి తనపై చర్యలు లేకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నాడని చెప్పారు. ఇందుకు నిదర్శనం గతంలో ఓటుకు నోటు కేసు నుంచి బయట పడేందుకు చంద్రబాబు తన సన్నిహితులైన నామా నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు వంటివారిని టీఆర్‌ఎస్‌లోకి పంపిన విషయం తెలుగు ప్రజలందరికీ తెలుసన్నారు.
Comments
Please login to add a commentAdd a comment