సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి, అమరావతి: ‘‘ఎవరో ఒక అభిమాని సానుభూతికోసం జగన్‌పై కత్తితో దాడి చేస్తే.. దానికి, నాకు సంబంధం ఉందంటూ మాపై బురద చల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బీజేపీ, వైఎస్సార్‌సీపీ ఒక్కటే. కాబట్టే జగన్‌పై దాడి కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు ఇచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. ఆ హక్కులను నేరుగా కేంద్రం హరిస్తోంది. లేనిదాన్ని సృష్టించడానికి.. లేనిపోని అపోహలు తేవడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది..’’ అని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం పునాదిపాడులో ఆదివారం నిర్వహించిన ‘జన్మభూమి–మాఊరు’ గ్రామసభలో సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరించకుండా మోసం చేసిందని మండిపడ్డారు. చెప్పింది వినకపోతే అణగదొక్కాలని చూస్తున్నారని, హక్కులకోసం పోరాటానికి దిగితే టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలపై ఐటీ దాడులు చేయించిందని ఆరోపించారు.
రాజకీయంకోసం కేరళలాంటి మంచి రాష్ట్రాన్ని బీజేపీ అతలాకుతలం చేసిందన్నారు. యూపీలో అఖిలేష్, మాయావతిలు వచ్చే ఎన్నికలకోసం సీట్లు సర్దుబాటు చేసుకుంటే వెంటనే అఖిలేష్‌పై ఉన్న పాత కేసుల మీద సీబీఐ దర్యాప్తుకు ఆదేశించారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించేందుకు మనపై కేంద్రం ఎదురుదాడి చేస్తోందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ అన్ని రంగాల్లో విఫలమయ్యారని విమర్శించారు. దేశాన్ని భ్రష్టు పట్టించినట్లుగానే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలని ప్రధాని మోదీ, అమిత్‌షా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధిలో గుజరాత్‌ను మించిపోతామనే భయం మోదీలో ఉందన్నారు. ఏపీకి ఏమీ ఇవ్వకపోగా చేస్తున్న అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రాభివృద్ధి కోసం పెట్టుబడులను ఆహ్వానించేందుకు దావోస్ వెళ్తుంటే వీల్లేదంటూ ఆంక్షలు పెట్టడం దారుణమని, రాష్ట్రంపై కేంద్ర పెత్తనాన్ని సహించేది లేదన్నారు. త్వరలో స్మార్ట్‌ఫోన్ పథకానికి రాష్ట్రంలో శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పారు. కాగా, జన్మభూమి కార్యక్రమం జరుగుతున్న తీరుపై జిల్లా కలెక్టర్లు, నోడల్ అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచానికే నమూనాగా రాష్ట్రాన్ని మారుస్తున్నామని చెప్పారు. కేంద్రంలో బీజేపీ నేతలు పనిచేయరని, పని చేయమంటే కేసులతో బెదిరిస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర హక్కుల్ని కేంద్రం హరిస్తోంది
Published Mon, Jan 7 2019 4:55 AM | Last Updated on Mon, Jan 7 2019 4:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment