సాక్షి, విజయవాడ : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. శనివారం విజయవాడలో ఆయన మీడియతో మాట్లాడుతూ.. పాదయాత్ర సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు కాలేదంటూ అంబటి విమర్శించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిలు మండుటెండల్లో పాదయాత్రలు చేస్తున్నారని, కానీ చంద్రబాబు మాత్రం రాత్రి సమయాల్లో యాత్ర చేశారని ఎద్దేవా చేశారు.
ప్రజాసంక్షేమం కన్నా కుటుంబ సంక్షేమమే ముఖ్యమని నమ్ముకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అంబటి దుయ్యబట్టారు. కుంభకోణాలు, అవినీతితో సంపాదించిన డబ్బుతో రానున్న ఎన్నికల్లో నారా లోకేష్‌ను ముఖ్యమంత్రి చేయాలకుంటున్నారని విమర్శించారు. నాలుగేళ్లు బీజేపీతో పొత్తుపొట్టుకొని వేలాడిన చంద్రాబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన వెంటనే తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంలో టీడీపీ, బీజేపీ రెండూ ముద్దాయిలే అని అన్నారు. చేసిన పాపం బీజేపీపై నెట్టేయడానికే చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారంటూ విమర్శించారు.
వైఎస్సార్ సీపీ రానున్న ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీతోను కలిసి పోటీ చేయదని అంబటి స్పష్టం చేశారు. తమ పార్టీ సూర్యుడి లాంటిదని, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా స్వయంగా, స్వతంత్రంగానే పోటీచేస్తుందని పేర్కొన్నారు. టీడీపీకి పొత్తుల్లేకుండా పోటీ చేసిన చరిత్ర లేదని, వారికి ఆ ధైర్యం తెలుగుదేశం పార్టీకి లేదని ఎద్దేవా చేశారు. టీటీడీ బోర్డులో బీజేపీకి చెందిన వాళ్లకు పదవులు ఇచ్చి మళ్లీ మోదీని కాకాపట్టే పనిలో ఉన్నారంటూ విమర్శించారు. సుజనా చౌదరి, సీఎం రమేష్ ఢిల్లీలో బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకుంటున్నారని రాంబాబు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment