హనుమంతవాక సభలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు
ఆరిలోవ (విశాఖ తూర్పు), కంచరపాలెం (విశాఖ ఉత్తర): నరేంద్ర మోడీ దుర్మార్గుడని, సీబీఐ, ఇంటెలిజెన్సీ, ఆర్‌బీఐ, ఎన్నికల కమిషన్లను ఆయన చేతిలో పెట్టుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నగరానికి వచ్చిన ఆయన కంచరపాలెం, హనుమంతవాక వద్ద జరిగిన రోడ్డు షోల్లో మాట్లాడారు. ప్రజల మనోభావాలు దెబ్బతీయడానికి మోడీ, జగన్, కేసీఆర్‌లు పని చేస్తున్నారని.. రాష్ట్రంపై కుట్ర పన్నుతున్నారంటూ విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలంతా ధర్మం కోసం పోరాటానికి అండగా నిలవాలన్నారు. నేను ప్రజల కోసం పనిచేస్తే వారు దెబ్బతీయడానికి చూస్తున్నారన్నారు. ఈవీ ప్యాట్‌లతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని విమర్శించారు.
డీజీపీని ట్రాన్స్‌ఫర్ చేశారని, ఈ రోజు చీఫ్ సెక్రటరీని కూడా ట్రాన్స్‌ఫర్ చేసి మనకు దెబ్బకొట్టారని తెలిపారు. సీఎస్, డీజీపీల ట్రాన్స్‌ఫార్లు వెనుక మోడీ కుట్ర ఉందని చంద్రబాబు ఆరోపించారు. వాళ్లను ఎదుర్కోవడానికి మీరంతా ఒక్కటై నాకు అండగా నిలవాలని కోరారు. జనసేన గూండాల పార్టీ అని విమర్శించారు. గాజువాక ప్రాంతంలో జనసేన పార్టీ సభ జరుగుతుండగా ఓ గర్భణిని ఈడ్చేశారని పేర్కొన్నారు. అలాంటి పార్టీ తరఫున ఎంïపీగా పోటీ చేస్తున్న లక్ష్మీనారాయణను ఓడించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీని తరిమికొట్టేందుకు తెలుగుతుమ్ముళ్లు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. నరేంద్రమోదీ బెదిరింపు చర్యలకు పూనుకుంటున్నారని విమర్శించారు. ఐదేళ్ల పాలనలో నేనిచ్చిన పథకాలు మీకు అందాయా అని, పనుపు–కుంకుమ పేరిట అక్కచెల్లెలకు అందించిన నజరానాతో నన్ను గుర్తు పెట్టుకుని మరో ఐదేళ్ల పరిపాలనకు అవకాశం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి భరత్, ఉత్తర పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థులు గంటా శ్రీనివాసరావు, పి.గణబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment