సాక్షి, అమరావతి : ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. సరిగ్గా పోలింగ్‌కు ఒకరోజు ముందు.. కొత్త డ్రామాకు తెరతీశారు. గత ఐదేళ్ల పాలనలో ఓ ఒక్క హామీని నెరవేర్చకుండా.. ప్రజలను పట్టించుకోకుండా.. ఊహల్లో ఊరేగిన నారావారు.. ఎన్నికలకు కొన్ని గంటలముందు ఏకంగా ధర్నాకు దిగారు. ఈసీ చర్యలను వ్యతిరేకిస్తూన్నానంటూ సెక్రటేరియట్ వద్ద చంద్రబాబు పార్టీ నేతలతో కలిసి నిరసనకు చేపట్టారు. ఈసీ వైఖరిని వ్యతిరేకించే పేరిట నిరసన ప్రదర్శన డ్రామాకు తెరతీయబోతున్నట్టు చంద్రబాబు ముందే తన అనుకూల మీడియా ద్వారా, టీడీపీ వర్గాల ద్వారా లీకులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
అంతా ఊహించినట్టుగానే.. చంద్రబాబు బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి.. ఈసీ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామంటూ ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఆ తర్వాత యథాలాపంగా ఈసీ తీరుపై, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీపై ఆయన విమర్శలు గుప్పించారు. ఈవీఎంలపై అనుమానాలున్నాయని, గతంలోనే తాము ఈవీఎంలపై ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని ఆయన వాపోయారు. ఫారం 7పైనా ఫిర్యాదు చేశామని, అయినా పట్టించుకోలేదని, సంబంధం లేకుండానే అధికారులను బదిలీ చేశారని, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీని కాపాడేందుకు తమ ఫిర్యాదులు పట్టించుకోవడం లేదని ఇలా చెప్పుకుంటూ.. మీడియాతో అర్ధగంటకుపైగా మాట్లాడిన చంద్రబాబు.. అనంతరం నిరసనకు దిగారు. ఈసీ క్లర్క్ ఉద్యోగం మాని బాధ్యతగా వ్యవహరించాలంటూ ఆరోపణలు చేశారు.
చంద్రబాబు నిరసన డ్రామా గురించి అంతకుముందే టీడీపీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ అయ్యేంతవరకు ధర్నా కొనసాగుతుందని, ఈ ఆందోళనలో ఆయనను పోలీసులు అరెస్టు చేస్తే.. పోలింగ్ వేళ సానుభూతి కోసం అరెస్టు అయ్యేందుకు ఆయన వెనకాడబోరని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ ధర్నా ముసుగులో రాష్ట్రంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు పచ్చ పార్టీ శ్రేణులు పథకాన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు మరికొన్ని గంటల్లో రాష్ట్రంలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో చంద్రబాబు ఆఖరి ప్రయత్నంగా.. మరిన్ని కుట్రలకు పాల్పడే అవకాశముందని, ఈ కుట్రలను అడ్డుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ కుట్రలను అడ్డుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఓటరు స్వేచ్ఛగా, నిర్భయంగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా.. ఓటు హక్కు వినియోగించుకునేవిధంగా ఎన్నికల కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ కోరింది.
ప్రజల్లో చంద్రబాబు పాలన పట్ల భారీ వ్యతిరేకత ఉండటం, ఎన్నికల్లో టీడీపీ వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనిపించడంతో చంద్రబాబు ఈమేరకు ఎన్నికల వేళ చీప్ ట్రిక్స్‌కు దిగుతున్నారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అయితే, పోలింగ్ ముందు చివరి నిమిషాల్లో చేపట్టే ఇలాంటి ఎత్తుగడల ద్వారా పెద్దగా ప్రయోజనముండదని ఆ పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. ప్రజల్లో సానుభూతి పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న చంద్రబాబు.. ఎన్నికల ప్రచారం సందర్భంగా కళ్లు తిరిగి పడిపోతారని ఇప్పటికే సోషల్ మీడియాలో గతంలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment