
సాక్షి, అమరావతి: రహస్యంగా ఎవరితో మంతనాలు జరపవద్దని సీఎం చంద్రబాబు టీడీపీ ఎంపీలకు సూచించారు. నాలుగు రోజుల క్రితం సుజనాచౌదరి, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో రహస్యంగా సమావేశమైన విషయం బయటపడటం, దాన్ని కప్పిపుచ్చుకోలేక నానా తంటాలు పడిన నేపథ్యంలో చంద్రబాబు ఎంపీలకు హెచ్చరికలు చేశారు. బుధవారం పార్టీ ఎంపీలతో బాబు టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తెరవెనుక జరిగే వ్యవహారాలు బయటపడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తన ఇమేజిని, పార్టీ ఇమేజిని దెబ్బతీయకుండా చూడాలని చెప్పారు. తాను ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనుకడుగు వేయనని తెలిపారు.
జీవితంలో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నానని, అన్నింటినీ సమర్ధంగా అధిగమించానని చెప్పారు. సర్కారియా కమిషన్ సిఫార్సులు అమలు చేయించింది టీడీపీయేనని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలను పునర్నిర్వచించింది టీడీపీయేననన్నారు. రాష్ట్రాల హక్కులను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఢిల్లీ వచ్చిన తెలుగు వారికి ఎంపీలు సహకరించలేదని అఖిలపక్షానికి హాజరైన కొందరు ప్రస్తావించారని, అది సరికాదని అన్నారు. ఏప్రిల్ 6 వరకు అందరూ నల్లబ్యాడ్జీలు ధరించాలన్నారు. పార్లమెంటుకు 4 రోజులు సెలవులు రానున్నాయని, ఇకపై ప్రతిరోజూ అత్యంత కీలకమన్నారు.