
సాక్షి, భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. టీడీపీ టిక్కెట్ ఆశించి భంగపడ్డ నందమూరి యువసేన జిల్లా అధ్యక్షులు చెరుకూరి రామకృష్ణ చౌదరి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగారు. టీడీపీ రెబల్ అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ పట్టణ కార్యదర్శి పడమటి సోమేశ్వరరావు, సాంబ్రాని నాగబాబుతో పాటు కూడా చెరుకూరి రామకృష్ణ చౌదరికి మద్దతుగా నిలిచారు.
సుబ్బారాయుడు కూడా..
నరసాపురం టిక్కెట్‌పై ఆశలు పెట్టకున్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా టీడీపీ రెబల్‌గా పోటీ చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. చంద్రబాబు టిక్కెట్ నిరాకరించడంతో కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవికి ఇప్పటికే రాజీనామా చేశారు. జనసేనలో చేరి ఎంపీగా పోటీ చేయాలని భావించినా కుదరకపోవడంతో తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
రాజారావుకు సుజాత ఝలక్
చింతలపూడి టీడీపీ అభ్యర్ధి కర్రా రాజారావుకు పీతల సుజాత వర్గం ఝలక్ ఇచ్చింది. రాజారావు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పీతల సుజాత హాజరుకాలేదు. పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. పీతల సుజాత వర్గీయులు రాకపోవడంతో కార్యక్రమం వెలవెలబోయింది. హడావుడి లేకపోవడంతో ఒక కారులో వచ్చి నామినేషన్ వేసి వెళ్లిపోయారు రాజారావు.
Comments
Please login to add a commentAdd a comment