pithala sujatha
-
చెంప చెళ్లుమనిపిస్తా! : పీతల సుజాత
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ‘చింతలపూడి నియోజకవర్గంలో రూ.1800 కోట్లతో అభివృద్ధి పనులు చేశాను. నా ఎదుగుదలను చూసి ఓర్వలేకే అంబికా కృష్ణ నాపై అసత్య ఆరోపణలు చేశారు. బుద్ధి ఉన్నోడు ఎవడూ అంత నీచంగా మాట్లాడడు’ అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీతల సుజాత అంబికా కృష్ణపై ధ్వజమెత్తారు. చింతలపూడి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పీతల సుజాత హయాంలో అభివృద్ధి జరగలేదని, ఆ పాపం కడిగేసుకోవడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ అభ్యర్థిని మార్చారని జంగారెడ్డిగూడెంలో రెండు రోజుల క్రితం ఆర్యవైశ్యులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో అంబికా కృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. చింతలపూడి నియోజకవర్గంలో టీడీపీ తరఫున ప్రచారం చేసి ఆర్యవైశ్యులను పార్టీకి దగ్గర చేయమని పార్టీ ఆదేశిస్తే, అంబికా కృష్ణ ఆ పని చేయకుండా తనపై ఆరోపణలు చేయడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రతిపక్షంతో లాలూచీ పడి తెలుగుదేశం పార్టీని ఓడించడానికి అంబికా కృష్ణ కంకణం కట్టుకున్నాడని అనుమానం వ్యక్తం చేశారు. తానేమీ అంబికా కృష్ణలా సొంత బావమరిది హోటల్‌ను ఆక్రమించుకోలేదని, బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు ఎగ్గొట్టలేదని ఎద్దేవా చేశారు. సినీ రంగంలో ఆయన వేషాలు అందరికీ తెలుసని అన్నారు. ఒక దశలో ఆమె అంబికా కృష్ణ తనపై చేసిన వ్యాఖ్యలను తలచుకుని కన్నీరు పెట్టుకున్నారు. దళిత మహిళననే తనపై ఇటువంటి ఆరోపణలు చేశారని, అగ్ర వర్ణాలు ప్రజాప్రతినిధులుగా ఉన్న మరో నియోజకవర్గంలోకి వెళ్లి అక్కడ అభివృద్ధి జరగలేదనే దమ్ము అంబికాకు ఉందా అని ప్రశ్నించారు. తనపై విమర్శలు చేసే వారిని ఇక ఉపేక్షించేది లేదని ఎవరినైనా చెంప ఛెళ్లుమనిపిస్తానని హెచ్చరించారు. అంబికా కృష్ణ తనపై చేసిన వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. -
నారీమణులు.. రాజకీయ దివ్వెలు
సాక్షి, తాడేపల్లిగూడెం : ఎన్నికల సంగ్రామంలో జిల్లాకు చెందిన మహిళలు నారీశక్తిని చాటిచెప్పారు. నరసాపురం నియోజకవర్గంలో 1981 ఉప ఎన్నికల్లో పరకాల కాళికాంబ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సా«ధించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1999లో ఆచంట రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి మోచర్ల జోహార్‌వతి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం పొందారు. 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పీతల సుజాత పోటీచేసి విజయం పొందారు. భీమవరం నుంచి 1995లో భూపతిరాజు కస్తూరి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. ఉండి నుంచి 1970 ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా కె.ఆండాళ్లమ్మ పోటీ చేసి విజయం సాధించారు. పెనుగొండ నియోజకవర్గం నుంచి 1983,1985లో టీడీపీ తరఫున ప్రత్తి మణెమ్మ పోటీచేసి విజయం పొందారు. అత్తిలి నియోజకవర్గం నుంచి 1955లో చోడగం అమ్మనరాజా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయబావుటా ఎగురవేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి 1972లో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన డాక్టర్ కోసూరి కనకలక్ష్మి ఓడిపోయారు. 1983 ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని ఈలి వరలక్ష్మి విజయం పొందగా, 1985లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఆమె తిరిగి 1987 ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించగా, 1989లో పోటీ చేసి పరాజయం చెందారు. దెందులూరు నుంచి 1985లో కాంగ్రెస్ తరçఫున ఎం.పద్మావతి పోటీ చేసి ఓటమి చెందారు. 1991 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మాగంటి వరలక్ష్మీదేవి విజయం పొందారు. ఏలూరు నుంచి 1994లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆమెకు పరాజయం ఎదురైంది. గోపాలపురం నియోజకవర్గం నుంచి 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ ఐ తరఫున పోటీ చేసి దాసరి సరోజనిదేవి గెలుపొందారు. 1983లో తిరిగి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఆమె పరాజయం పాలయ్యారు. 1985 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన నంబూరి ఝాన్సీరాణి విజయం సాధించలేదు. 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన మద్దాల సునీత ఓటమిపాలై.. 2004లో విజయం సాధించారు. 2009లో తానేటి వనిత టీడీపీ తరపున పోటీచేసి గెలిచారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా పీతల సుజాత చింతలపూడిలో గెలుపొందారు. -
టీడీపీ రెబల్‌గా చెరుకూరి
సాక్షి, భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. టీడీపీ టిక్కెట్ ఆశించి భంగపడ్డ నందమూరి యువసేన జిల్లా అధ్యక్షులు చెరుకూరి రామకృష్ణ చౌదరి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగారు. టీడీపీ రెబల్ అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ పట్టణ కార్యదర్శి పడమటి సోమేశ్వరరావు, సాంబ్రాని నాగబాబుతో పాటు కూడా చెరుకూరి రామకృష్ణ చౌదరికి మద్దతుగా నిలిచారు. సుబ్బారాయుడు కూడా.. నరసాపురం టిక్కెట్‌పై ఆశలు పెట్టకున్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా టీడీపీ రెబల్‌గా పోటీ చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. చంద్రబాబు టిక్కెట్ నిరాకరించడంతో కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవికి ఇప్పటికే రాజీనామా చేశారు. జనసేనలో చేరి ఎంపీగా పోటీ చేయాలని భావించినా కుదరకపోవడంతో తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాజారావుకు సుజాత ఝలక్ చింతలపూడి టీడీపీ అభ్యర్ధి కర్రా రాజారావుకు పీతల సుజాత వర్గం ఝలక్ ఇచ్చింది. రాజారావు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పీతల సుజాత హాజరుకాలేదు. పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. పీతల సుజాత వర్గీయులు రాకపోవడంతో కార్యక్రమం వెలవెలబోయింది. హడావుడి లేకపోవడంతో ఒక కారులో వచ్చి నామినేషన్ వేసి వెళ్లిపోయారు రాజారావు. -
మాగంటి బాబు Vs పీతల సుజాత
అమరావతి: ఏపీ సచివాలయంలో చింతలపూడి టీడీపీ నేతలు వాదులాటకు దిగారు. కొద్దిరోజులుగా ఎంపీ మాగంటి బాబు, పీతల సుజాత వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. దీనిపై మాట్లాడేందుకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పుల్లారావు ఇరువర్గాల వారిని సోమవారం నాలుగో బ్లాక్‌లోని తన ఛాంబర్‌కు పిలిపించారు. మాజీ మంత్రి పీతల సుజాత నేతృత్వంలో ఇరువర్గాల వారిని విబేధాలు వీడి పని చేసుకోవాలని సూచించారు. అనంతరం మంత్రి ఛాంబర్ నుంచి బయటకు రాగానే వారు వాదులాటలు మొదలుపెట్టారు. ఈ పరిణామం చూసిన అక్కడి వారు ముక్కున వేలేసుకున్నారు. -
మంత్రులకు తప్పిన ముప్పు
కామవరపుకోట: పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట సమీపంలో ఆంధ్రప్రదేశ్ మంత్రులకు తృటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం మంత్రులు ప్రయాణిస్తున్న వాహనాలు పరస్పరం ఢీకొనడంతో నలుగురు సెక్యూరిటీ సిబ్బందికి గాయాలయ్యాయి. జిల్లాలో పర్యటిస్తున్న మంత్రులు పీతల సుజాత, పరిటాల సునీత ప్రయాణిస్తున్న వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో మంత్రులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కామవరపుకోట వద్ద మంత్రుల కాన్వాయ్‌కు గొర్రెల మంద అడ్డురావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.