
సాక్షి, తిరుపతి : ప్రజలను, దేశ భద్రతను కాపాడాల్సిన ఒక ఐపీఎస్ అధికారి దారుణంగా వ్యవహరించారని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం డీజీగా ఉండి ఏబీ వెంకటేశ్వరరావు సంఘ విద్రోహ చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. త్వరలోనే ఏబీ వెంకటేశ్వరరావు అవినీతి అక్రమాలు మరికొన్ని బయట పెడతానని అన్నారు. సోమవారం చెవిరెడ్డి మాట్లాడుతూ.. ఏబీ వెంకటేశ్వరరావు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారాడని.. ఆ సొమ్ముతో తెలంగాణలో విచ్చల విడిగా భూములు కొనుగోలు చేశారని చెప్పారు. తెలంగాణలో కొన్న భూములకు రైతుబంధు పథకం ద్వారా రూ. 67 లక్షలు తీసుకున్నారని తెలిపారు.
ఏబీ వెంకటేశ్వరరావు అవినీతి తిమింగలం అని.. ఆయన విషయాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయనపై సంఘ విద్రోహం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఘట్టమనేని శ్రీనివాస్ అనే వ్యక్తి ఏబీ వెంకటేశ్వరరావు బినామీ అని చెప్పారు. ఆయన అవినీతి అక్రమాలు మిగతా ఐపీఎస్ అధికారులకు కూడా తెలుసని అన్నారు. విజయవాడ జంట హత్యల కేసులో కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు కాజేశాడని విమర్శించారు. ఆయన దేశం విడిచిపెట్టి పోయే ప్రమాదం ఉందని.. కేంద్రం వెంటనే లుకౌట్ నోటీసులు విడుదల చేయాలని కోరారు. ఆయనపై తనకు వ్యక్తిగత కక్ష లేదని.. దేశ భద్రత కోసమే మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. ఇలాంటి వ్యక్తులను ఎవరు మద్దతుగా నిలవకూడదని.. ప్రభుత్వ చర్యలను ప్రతి ఒక్కరు సమర్ధించాలని పిలుపునిచ్చారు.
చదవండి : వామ్మో.. ఏబీవీ!