సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి: డ్రోన్ల కొనుగోలు కుంభకోణంలో సస్పెన్షన్‌కు గురైన సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో(క్యాట్) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని క్యాట్ తేల్చిచెప్పింది. ఏబీవీని సస్పెండ్ చేయడానికి కచ్చితమైన ప్రాథమిక ఆధారాలున్నాయని స్పష్టంచేసింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేయాలని ఏబీవీ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం క్యాట్ కొట్టివేసింది. ఈ మేరకు క్యాట్ చైర్మన్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి, సభ్యుడు బీవీ సుధాకర్‌రావుతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది.
సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గం ఉన్నప్పటికీ క్యాట్‌లో ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్ దాఖలు చేయడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. అఖిల భారత సర్వీసు నిబంధన 16 ప్రకారం.. సస్పెన్షన్‌పై కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించకుండా క్యాట్‌లో కేసు దాఖలు చేయడం చెల్లదని తీర్పులో స్పష్టం చేసింది. నిబంధన 3 ప్రకారం.. క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొంటున్న అధికారిని సస్పెండ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తేల్చి చెప్పింది. నిబంధన 3 (1) ప్రకారం.. సస్పెన్షన్ చేసిన నెల రోజుల్లోగా క్రమశిక్షణా చర్యలు చేపట్టకపోయినా.. సస్పెన్షన్‌ను కేంద్రం ఖరారు చేయకపోయినా రాష్ట్రం తీసుకున్న సస్పెన్షన్ ఉత్తర్వులు చెల్లవని చెప్పింది. అందుబాటులో ఉన్న ఆధారాలను పరిగణనలోకి తీసుకుని తాము న్యాయసమీక్ష చేశామని వివరించింది. సస్పెన్షన్‌కు కారణమైన అక్రమాలు, పక్షపాతం, వంటి ఆరోపణల్లో పిటిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు పాత్ర ఉందో లేదో తేలాలంటే పూర్తిస్థాయిలో విచారణ జరగాల్సిందేనని పేర్కొంది.
ఏబీవీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డగోలుగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన అవినీతి, అక్రమాలపై లోతైన విచారణ జరిగితే చివరకు అవన్నీ చంద్రబాబు మెడకే చుట్టుకుంటాయని సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారంటూ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఫిబ్రవరి 8న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారణ!
క్యాట్ నిర్ణయం వెలువడిన నేపథ్యంలో ఏబీవీ అవినీతి, అక్రమాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టింది. ఇప్పటికే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు అత్యంత రహస్యంగా లోతైన విచారణ సాగించారు. స్వామికార్యం, స్వకార్యం అన్నట్లుగా చంద్రబాబు కోసం పనిచేసిన ఏబీవీ పలు అవకతవకలకు పాల్పడినట్లు ముగ్గురు ఐపీఎస్ అధికారుల బృందం గుర్తించింది. దేశ భద్రతకు తూట్లు్ల పొడిచేలా తన కుమారుడి కంపెనీ పేరుతో ఇజ్రాయెల్ తదితర దేశాల నుంచి నిఘా పరికరాల కొనుగోళ్లలో ఆయన నిబంధనలు అతిక్రమించారని తేల్చింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. అక్రమాస్తులను కూడబెట్టినట్టు ఏబీవీపై ఆరోపణలు రావడంతో అవినీతి నిరోధక శాఖ విచారణ చేపట్టనున్నట్టు సమాచారం. ఏబీవీపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీతోపాటు దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా వ్యవహరించినందుకు సీబీఐ, ఎన్‌ఐఏ వంటి జాతీయ దర్యాప్తు సంస్థలతోనూ విచారణ జరిపించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment