
లక్నో: సీరియస్‌గా కేబినెట్ భేటీ లేదా సీఎం సమావేశాలు జరుగుతున్న సమయంలో కొందరు మంత్రులు తీరిగ్గా వాట్సాప్ మెసెజ్‌లు చదువుతున్నారంట. దీంతో చీరెత్రుకొచ్చిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కేబినెట్ సమావేశాల్లో ఎవరూ సెల్‌ఫోన్‌లు వాడరాదంటూ నిషేధం విధించారు. అంతేకాకుండా తన అధికారిక భేటీల్లోనూ ఎవరూ మొబైల్ ఫోన్లు వాడకుండా నిషేధించారు.
‘కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతున్న అంశంపైనే మంత్రులంతా శ్రద్ధ పెట్టాలని సీఎం భావిస్తున్నారు. మొబైల్ ఫోన్స్ వల్ల ఎవరూ తమ దృష్టిని మరల్చకూడదు. సమావేశాల్లో కొందరు మంత్రులు వాట్సాప్ మెసెజ్‌లు చదువుతూ బీజీగా ఉంటున్నారు. అందుకే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు’ అని సీఎం కార్యాలయంలోని ఓ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు.
ఎలక్ట్రానిక్ పరికరాల హ్యాకింగ్, ఇతరత్రా దుర్వినియోగపరిచే ముప్పు ఉండటం కూడా ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. ఇంతకుమునుపు తమ సెల్‌ఫోన్లు సైలెంట్ మోడ్‌లో పెట్టుకొని సీఎం సమావేశాల్లో పాల్గొనేందుకు మంత్రులకు అనుమతి ఉండేది. ఇప్పుడు మంత్రులంతా నిర్దేశిత కౌంటర్‌లో తమ ఫోన్లను అప్పగించి.. టోకెన్ తీసుకొని.. సమావేశాలు ముగిసిన తర్వాత వాటిని తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది.