
సాక్షి, హైదరాబాద్ : తన బావమరిది నందమూరి హరికృష్ణ రోడ్డుప్రమాదంలో మృతిచెందడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతాపం ప్రకటించారు. ‘హరికృష్ణ మృతి తెలుగుదేశం పార్టీకే కాదు, రాష్ట్రానికే తీరనిలోటు. హరికృష్ణ లేని లోటు పూడ్చలేనిది. బాలనటుడిగా, కథానాయకునిగా, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఆయన నిలిచిపోయారు. సాంఘిక, పౌరాణిక, చారిత్రాత్మక పాత్రల పోషణలో హరికృష్ణది అందెవేసిన చెయ్యి. చలనచిత్ర రంగానికి, రాజకీయ రంగానికి ఎనలేని ఆయన సేవలు అందించారు. ఎన్టీఆర్ కు అత్యంత ఇష్టుడు నందమూరి హరికృష్ణ. ఎన్టీఆర్ చైతన్య రథసారధి నందమూరి హరికృష్ణ. తానే స్వయంగా డ్రైవింగ్ చేస్తూ ఎన్టీఆర్ ను రాష్ట్ర ప్రజలకు చేరువ చేశారు. శాసనసభ్యునిగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా ఆయన ఎనలేని సేవలు అందించారు. ఆయన మృతి వ్యక్తిగతంగా నాకు, మా కుటుంబానికి తీరనిలోటు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.