ఏం స్కెచ్‌ బాబు! | CM chandrababu naidu new sketch with women committees | Sakshi
Sakshi News home page

ఏం స్కెచ్‌ బాబు!

Published Sat, Mar 3 2018 11:10 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

CM chandrababu naidu new sketch with women committees - Sakshi

కావలి పట్టణంలో పొదుపు మహిళ గ్రూపు సమావేశాలు

2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా చంద్రబాబు కొత్త స్కెచ్‌ వేశారు. ఇప్పటి వరకు జన్మభూమి కమిటీలతో తమ వాళ్లకే ప్రభుత్వ పథకాలు కట్టబెట్టి, ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న చంద్రబాబు తాజాగా పొదుపు మహిళల సహకారంతో మళ్లీ అధికారంలోకి రావాలనే ఎత్తుగడ వేశారు. వీరికి సాధికార మిత్ర హోదా కల్పించి,  ప్రతి 35 కుటుంబాలకు ఒక సాధికార మిత్రను నియమించనున్నారు. వీరి ద్వారా ప్రతి కుటుంబానికి మేలు చేస్తామనే ప్రచారం చేయించుకుని ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తున్నారు. చంద్రబాబు తన ప్రణాళిక అమలుకు అధికార యంత్రాంగం తోడ్పాటు తీసుకుంటున్నారు. అయితే బాబు వ్యూహాన్ని అర్థం చేసుకున్న పొదుపు మహిళలు సాధికార మిత్రలుగా నియమితులు కావడానికి అయిష్టత వ్యక్తం చేస్తున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కావలి:  చంద్రబాబు ప్రభుత్వం తాజాగా పొదుపు గ్రూపు మహిళలను అస్త్రంగా చేసుకుని ప్రజల వద్దకు వెళ్లాలని తలపోస్తోంది. ఇప్పటికే టీడీపీ గల్లీ లీడర్లతో ఉన్న జన్మభూమి కమిటీలతో ప్రజలు విసుగెత్తిపోయారు. ఈ నేపథ్యంలో ప్రజ ల వద్దకు వారి మధ్యనే ఉన్న మహిళలనే ప్రభుత్వం తరపున రాయబారిగా పంపించే రాజకీయ వ్యూహాత్మక అడుగులు ప్రారంభమయ్యాయి.  ప్రతి 35 ఇళ్లకు ఒక పొదుపు  మహిళను గుర్తించి వారికి ‘సాధికార మిత్ర’ అనే ఆకర్షణీయమైన పేరును పెట్టారు. వీరు తమకు కేటా యించిన 35 నివాస గృహాలకు వెళ్లి చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు చెప్పాలి. ఆ కుటుంబంలో ఉన్న వారి సమగ్ర వివరాలతో పాటు  వ్యక్తిగత మొబైల్‌ నంబర్లు సేకరించాలి. రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తే వీరి ద్వారానే అన్ని కల్పిస్తామనే హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే  జిల్లాలోని 27,192 మంది పొదుపు మహిళలను ‘సాధికార మిత్ర’ పేరుతో అధికారులు జాబితాను సిద్ధం చేశారు.

ఇదీ కార్యాచరణ ప్రణాళిక
జిల్లాలో 2011 జనాభా లెక్కలు ప్రకారం 29.64 లక్షలు మంది ఉన్నారు. తాజా లెక్కల ప్రకారం 35 లక్షల మంది ఉంటారని అంచనా. 2011 జనాభా లెక్కలు ప్రకారం జిల్లాలో 7.77 లక్షలు నివాస గృహాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 5.67 లక్షలు,  పట్టణ ప్రాంతాల్లో 2.1 లక్షలు ఉన్నాయి. తాజాగా ఈ సంఖ్య జిల్లాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 9 లక్షలు నివాస గృహాలు ఉన్నాయని అంచనా. మార్చి 21వ తేదీ లోగా ఈ ‘సాధికార మిత్ర’లు ఒక విడత 9 లక్షల కుటుంబాల ను చుట్టేసి ఆ కుటుంబాల వివరాలను చంద్రబాబు ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంది. దీని కోసం గ్రామీణ ప్రాంతా ల్లో డీఆర్‌డీఏ అధికారులు, సిబ్బంది, మున్సిపాలిటీ పట్టణ ప్రాంతాల్లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు, సిబ్బంది ఉరుకులు పరుగుల మీద కసరత్తు చేస్తున్నారు. సమాజ సేవ కోసమే ఈ పని చేయాలని  ‘సాధికారిక మిత్ర’లైన మహిళలు అధికారులు చెబుతుంటే.. ఇదేం కర్మఅంటూ పొదుపు మహిళలు మండిపడుతున్నారు.

జిల్లాలో ఎనిమిది కస్టర్లు
జిల్లాలో గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ)లో భాగమైన వెలుగు కింద జిల్లాలోని 46 మండలాల్లో 8 క్లస్టర్లు ఉన్నాయి. ఈ క్లస్టర్ల పరిధిలో 3,90,500 మంది పొదుపు మహిళలు ఉన్నారు. వీరు 39,050 గ్రూపులుగా ఏర్పడి ఉన్నారు. ప్రతి గ్రామంలో ఒక ప్రాంతంలో వరుసగా ఉన్న 35 ఇళ్లకు ఈ పొదుపు మహిళల్లో నుంచి ఒకరిని ‘సాధికార మిత్ర’గా ఎంపిక చేశారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 20,500 మందిని ఎంపిక చేసి జాబితాను ప్రభుత్వానికి పంపారు. పట్ట ణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 3,777 మంది, కావలి 853 , గూడూరు 508, వెంకటగిరి 471, ఆత్మకూరు 330, సూళ్లూరుపేట 310 మంది ని, నాయుడుపేట నగర పంచాయతీలో 443 మందిని ‘సాధికారమిత్ర’ లను ఎంపిక చేశారు. పట్టణాల్లో 1,26,169 మంది పొదుపు మహిళలతో ఉన్న 12, 246 గ్రూపుల నుంచి 6,692 మందిని  ఎంపిక చేశారు.  జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 27,192 మంది సాధికార మిత్రలతో కూడిన బాబితాను అధికారులు సిద్ధం చేశారు.  

వీరు ఏమి చేయాలంటే..
ప్రతి సాధికార మిత్ర వారికి కేటాయించి న ప్రతి ఇంటి వెళ్లికి  కుటుంబ సభ్యుల వివరాలు, వారి వృత్తులు, వారి సామాజిక స్థితిగతులు, వారి మొబైల్‌ నంబర్లు సేకరించాలి. ప్రస్తుతం ఈ ప్రక్రియను ప్రారంభించి ఈ నెల 21వ తేదీ లోగా పూర్తి చేయాలి. ఇందుకు చాలామంది పొదుపు మహిళలు వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రతికూలతల నడుమ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా కుటుంబాల స్థితిగతులను సేకరించి ప్రభుత్వానికి గడువులోగా అందజేసేదెలా అంటూ అధికారులు తలలు పట్టుకొంటున్నారు. ఇప్పటికే సిద్ధం చేసుకున్న జాబితాల నుంచి తొలిగించమని డిమాండ్‌ ఎక్కువ కావడంతో కొత్త పేర్లు చేర్చడానికి ఆపసోపాలు పడుతున్నారు. 

హ్యాండ్‌ బుక్‌లోనే అన్నీ గైడ్‌ లైన్లు
ఈ మిత్రలకు పంపిణీ చేయడానికి 100 పేజీలతో ఉన్న హ్యాండ్‌ బుక్‌ను సిద్ధం చేశారు. అందులో మిత్రలు ఏమి చేయా లి, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను పొందు పరిచారు. హ్యాండ్‌ బుక్‌లో ఉన్న అంశాలను మిత్రలు అనుసరించాలన్నారు. ప్రజలతో గౌరవ బాధ్యతలో, వినయ విధేయతలతో నడుచుకొంటూ ‘ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి’లా పని చేయాలి.  ఈ సేవలు చేసినందుకు ప్రభుత్వం నుంచి నయా పైసా లబ్ధి లభించదు. ప్రజలు ప్రశ్నించినప్పుడు ఓపికగా సమాధానం చెప్పాలి, ప్రభుత్వం ద్వారా ప్రయోజనం చేకూరకపోతే∙ప్రజలకు జవాబు చెప్పాల్సి వస్తుందన్న భయంతో పని చేయాలి. 

బాబూ మోసంతో ఉడికి పోతున్న పొదుపు మహిళలు
గత ఎన్నికల ముందు పొదుపు గ్రూపు మహిళలు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు మోసం బ్యాంక్‌ల్లో తమ పరపతిని పోగొట్టాడని మండిపోతున్నారు. ప్రభుత్వం నుంచి తమకు నయా పైసా లాభం లేకపోయినా ప్రభుత్వ పథకాలకు, పార్టీకి తాము ప్రచార కార్యకర్తల్లా పని చేయాలా? అని ప్రశ్నిస్తున్నారు. పొదుపు సభ్యులుగా తమకు బ్యాంక్‌లు రుణాలు ఇస్తున్నా యి.. తిరిగి తామే కట్టుకుంటున్నప్పుడు ఈ ప్రభుత్వానికి ఎందుకు వెట్టి చాకిరి చేయాలని నిలదీస్తున్నారు. పొదుపు గ్రూపుల్లో సభ్యులం కావడంతో తమను చంద్రబాబు, ఆయన కుమారుడు పర్యటనలకు జనబలం చూపించుకునేందుకు వాడుకుం టున్నారని దుయ్యబట్టుతున్నారు.  రోజువారీ కూలీలు, మధ్యతరగతి, రైతువారీ కుటుంబాల్లోని వారే సభ్యులుగా ఉన్నారు. తమ పనులను పక్కన పెట్టుకుని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. నాలుగేళ్లుగా పొదుపు మహిళలకు ఏమీ చేయకపోగా, మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు తమను పావులుగా ఉపయోగపెట్టుకునేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని పొదుపు మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం ఆదేశాల మేరకే
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకే సాధికార మిత్రలను ఎంపిక చేశాం. మిత్రలుగా పనిచేయడానికి ఇష్టపడని వారి పేర్లను తొలగించి ఇతరులతో జాబితాను సిద్ధం చేస్తున్నాం. వారితో ఇంటింటికీ వెళ్లి కుటుంబాలు స్థితిగతులను తెలుసుకునే పనిని ప్రారంభిస్తాం.  –లావణ్యవేణి, డీఆర్‌డీఏ పీడీ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement