ఉండవల్లిలో జరిగిన అంగన్‌వాడీ సదస్సులో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: అలవికాని హామీలు గుప్పిస్తున్న కోతిమూకలు అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారుతుందని ప్రజలకు చెప్పాలని అంగన్‌వాడీ ఉపాధ్యాయులకు సీఎం చంద్రబాబు సూచించారు. అంగన్‌వాడీ టీచర్లకు జీతాలు పెంచామని, అందుకు కృతజ్ఞతగా తనకు అనుకూలంగా ప్రజల్లో ప్రచారం చేయాలని కోరారు. శనివారం ఉండవల్లిలోని తన నివాసం పక్కనున్న గ్రీవెన్స్ హాలులో కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి తీసుకొచ్చిన అంగన్‌వాడీ టీచర్లతో చంద్రబాబు సమావేశమయ్యారు.
రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, ప్రభుత్వం సాధించిన విజయాలను పిల్లల తల్లిదండ్రులకు, గ్రామీణులకు తెలియజేయాలన్నారు. ఒక పార్టీ వరుసగా ఎన్నికల్లో గెలిచి అధికారంలో ఉంటేనే అభివృద్ధి కొనసాగుతుందని ప్రజలకు చెప్పాలన్నారు. పోరాటం చేయాల్సిన అవసరం లేకుండా జీతాలు పెరగడంతో అంగన్‌వాడీ టీచర్లలో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినంత ఆనందం కనిపిస్తోందని చంద్రబాబు చెప్పారు. స్విస్ బ్యాంక్‌ల నుంచి నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి, ప్రతి పౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న హామీని ప్రధాని నరేంద్రమోదీ నెరవేర్చలేకపోయారని చంద్రబాబు విమర్శించారు.
కర్నూలు జిల్లా నేతలపై బాబు ఆగ్రహం
కర్నూలు జిల్లా టీడీపీ నాయకులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత చెప్పినా విభేదాలు వీడడం లేదని, ఇసుక విషయంలో ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన శనివారం గ్రీవెన్స్ హాల్‌లో కర్నూలు జిల్లా టీడీపీ నాయకులతో సమావేశమయ్యారు. తాను వచ్చే వారం నుంచి ఒక్కో జిల్లాలో 2 రోజులపాటు పర్యటిస్తానని చంద్రబాబు చెప్పారు. కాగా, ఇసుక రీచ్‌ల పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తున్నట్లు సీఎం తెలిపారు.
ఇసుక రీచ్‌ల నిర్వహణ తీరును ఆయన శనివారం సచివాలయంలోని కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి పరిశీలించారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని ‘1100’ కాల్‌సెంటర్ సర్వే ద్వారా 25% మంది ప్రజలు తెలిపారని సీఎం పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్న మెగా సీడ్ పార్క్‌కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను అమెరికాకు చెందిన ఐయోవా స్టేట్ యూనివర్సిటీ ప్రతినిధులు సీఎంకు అందించారు. వారు శనివారం సచివాలయంలో చంద్రబాబును కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment