సోమవారం టీఆర్‌ఎస్ భవన్‌లో జరిగిన ఎల్పీ భేటీలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్
కొన్ని కారణాలతో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్‌ఎస్ తరఫున అభ్యర్థులను బరిలోకి దించలేదు. అయితే ఈ ఎన్నికలను ఎమ్మెల్యేలు పట్టించుకోకుండా ఉండొద్దు. బీ–ఫారం ఇవ్వకపోయినా పాతూరి సుధాకర్‌రెడ్డి, పూల రవీందర్, మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ గెలిచేందుకు సహకరించాలి. ఈ ముగ్గురి గెలుపు కోసం సహకారం అందించాలి. ఇచ్చిన మాట ప్రకారం ఎగ్గె మల్లేశానికి అవకాశం ఇచ్చా. యాదవ సభలో మల్లేశానికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని ప్రకటిస్తే జైపాల్‌యాదవ్ అలిగారు. నోముల నర్సింహయ్య మంత్రి జగదీశ్‌రెడ్డిని కొట్టినంత పని చేశారు. జైపాల్, నర్సింహయ్యకు అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం ఇస్తే ఇద్దరూ గెలిచారు. మల్లేశం ఎమ్మెల్సీ అవుతున్నారు. శేరి సుభాష్‌రెడ్డికి ఆలస్యంగా అవకాశం వచ్చింది. సుభాష్‌రెడ్డి ఎప్పుడో ఎమ్మెల్సీ కావాల్సి ఉండె. – సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీతోపాటు లోక్‌సభ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌దే ఘనవిజయమని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 16 లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని చెప్పారు. ఈ దిశగా ఎమ్మెల్యేలు పూర్తిగా దృష్టిపెట్టి పని చేయాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల్లో కొందరు సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ పోటీ చేసే అవకాశం ఇవ్వలేమని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినవారి విషయంలో కఠినంగా ఉంటామన్నారు. మజ్లిస్‌తో కలిసి ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధిస్తున్నామని సీఎం చెప్పారు. మరో నలుగురైదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. మంగళవారం.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణభవన్‌లో సోమవారం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలపైనా సీఎం కేసీఆర్ ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.
మార్చి 17 నుంచి ప్రచారం
‘లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 16 స్థానాల్లో గెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మనల్ని ఆదరించారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇలాగే ఆదరిస్తారు. మనం కచ్చితంగా గెలుస్తాం. అయితే అన్ని సీట్లలో భారీ మెజారిటీతో గెలవాలి. శాసనసభ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలే సుప్రీం. ఈ విషయంలో ఎలాంటి చర్చ లేదు. మంత్రులు, ఎంపీలు వారితో సమన్వయం చేసుకోవాలి. ఎమ్మెల్యేలు సమన్వయంతో పనిచేసి టీఆర్‌ఎస్ ఎంపీలను భారీ మెజారిటీతో గెలిపించాలి. మార్చి 17 నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తాను. కరీంనగర్ నుంచి మొదలుపెడతాం. మార్చి 19న నిజామాబాద్‌లో ప్రచారం సభకు వస్తాను. అన్ని సెగ్మెంట్లలో వరుసగా సభలు నిర్వహించేందుకు త్వరలోనే షెడ్యూల్ ఇస్తాం. జనసమీకరణ, ఇతర ఏర్పాట్లు చేయాలి. ఈసారి ఎన్నికల్లో కొందరు సిట్టింగ్‌లకు అవకాశం కల్పించలేకపోతున్నాం. ముగ్గురు, నలుగురు ఎంపీల విషయంపై ఆలోచిస్తున్నాం.
పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. ఎంపీలుగా అవకాశం ఇవ్వని వారు ఆందోళనపడొద్దు. ఇన్నాళ్లు పదవిలో ఉండి ఒక్కసారిగా అవకాశం రాకపోతే కొంత ఇబ్బంది ఉంటుంది. లోక్‌సభ ఎన్నికలలో అవకాశం రాని వారికి రాష్ట్ర స్థాయిలో అవకాశాలు ఇస్తా. అభ్యర్థులు ఎవరైనా భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరే విషయంలో ముందుగా వద్దనుకున్నాం. అయితే వాళ్లంతట వారే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. వచ్చే వారిని చేర్చుకుంటున్నాం. మరో నలుగురైదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వారితోనూ మాట్లాడాలి’అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
ఆ ఐదు మనవే!
శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో విజయం తమదేనని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటింగ్ తీరు ఎలా ఉండాలనే దానిపై సీఎం కేసీఆర్ సూక్ష్మస్థాయిలో వివరించారు. జాగ్రత్తగా ఓటు వేయాలని సూచించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు మహమ్మద్ మహమూద్‌అలీ, సత్యవతి రాథోడ్, ఎగ్గె మల్లేశం, శేరి సుభాష్‌రెడ్డిలను ఎమ్మెల్యేలకు పరిచయం చేశారు. ‘ఇచ్చిన మాట ప్రకారం ఎగ్గె మల్లేశంకు అవకాశం ఇచ్చాను. యాదవసభ సభలో మల్లేశంకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని ప్రకటిస్తే జైపాల్‌యాదవ్ నాపై అలిగారు. నోముల నర్సింహయ్య ఏకంగా మంత్రి జగదీశ్‌రెడ్డిని కొట్టినంత పని చేశారు. జైపాల్‌యాదవ్, నోముల నర్సింహయ్యకు అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం ఇస్తే ఇద్దరూ ఎమ్మెల్యేలుగా గెలిచారు.
మల్లేశం ఎమ్మెల్సీ అవుతున్నారు. శేరి సుభాష్‌రెడ్డికి ఆలస్యంగా అవకాశం వచ్చింది. సుభాష్‌రెడ్డి ఎప్పుడో ఎమ్మెల్సీ కావాల్సి ఉండె. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు స్థానాలకు అభ్యర్థులను పోటీకి దింపే ముందు సమగ్రంగా అంచనా వేసుకున్నాం. మన ప్రభుత్వ పనితీరు నచ్చి ప్రజలకు మనకు 88 స్థానాల్లో విజయం కట్టబెట్టారు. మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారు. మనకు ఉన్న బలంతోనే ఐదు ఎమ్మెల్సీ స్థానాలను గెలుస్తున్నాం. కాంగ్రెస్ అభ్యర్థి పోటీ వద్దని అన్నాను. ఆ పార్టీ నేతలు వినకుండా పోటీ పెట్టారు. టీఆర్‌ఎస్ నుంచే ఇద్దరు తమకు మద్దతిస్తారని కాంగ్రెస్ నేతలన్నారు. దీంతో అన్ని స్థానాలకు పోటీ పెట్టాలని నిర్ణయించాం. ఇప్పుడు అన్ని స్థానాల్లో మన అభ్యర్థులే గెలుస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మంత్రులు ఎమ్మెల్యేలతో సమన్వయం చేయాలి’అని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీపై..
ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలోనూ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా సూచనలు చేశారు. ‘కొన్ని కారణాలతో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్‌ఎస్ తరుపున అభ్యర్థులను బరిలో దించలేకపోయాం. అయితే ఈ ఎన్నికలను ఎమ్మెల్యేలు పట్టించుకోకుండా ఉండవద్దు. బీ–ఫారం ఇవ్వలేకపోయినా పాతూరి సుధాకర్‌రెడ్డి, పూల రవీందర్, మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ గెలిచేందుకు మీరు సహకరించాలి. ఈ ముగ్గురి గెలుపు కోసం మీ నియోజకవర్గాల పరిధిలో సహాయ సహకారాలు అందించాలి’అని సీఎం కేసీఆర్ అన్నారు.
రెండుసార్లు మాక్ పోలింగ్
శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు ముందు జాగ్రత్తగా టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో మాక్ పోలింగ్ నిర్వహించారు. అందరు ఎమ్మెల్యేలతో ఓటు వేయించారు. ఐదుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల వారీగా ఎమ్మెల్యేలను విభజించారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసే విషయంలో ఆదేశాలు జారీ చేశారు. ముందుగా ఆదేశించిన ప్రకారం మాక్‌పోలింగ్ నిర్వహించారు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ మాక్‌పోలింగ్ రెండుసార్లు నిర్వహించారు. దీంతో మాక్‌పోలింగ్‌లో వోటు వేసే విషయంలో ఎవరైనా పొరపాటు చేశారా అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చర్చించుకున్నారు.
ఎమ్మెల్యేలకు మాత్రమే!
టీఆర్‌ఎస్ ఎల్పీ భేటీలో సాధారణంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొంటారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం ప్రతిసారి ఇలాగే జరిగేది. సోమవారం నిర్వహించిన సమావేశానికి మాత్రం కేవలం ఎమ్మెల్యేలనే అనుమతించారు. భేటీ సమయంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ తెలంగాణ భవన్‌కు వచ్చారు. అయితే ఎంపీలకు అనుమతి లేకపోవడంతో సమావేశం గదిలోకి వెళ్లలేదు.
Comments
Please login to add a commentAdd a comment