
కోల్‌కతా: తన మొబైల్ నెంబర్‌కు ఆధార్ జతపరిచేది లేదని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ రోజు జరిగిన పార్టీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తన ఫోన్ పనిచేయకపోయినా సరే తాను మాత్రం మొబైల్ నెంబర్‌కు ఆధార్ లింక్ చేసుకునేది లేదని ఆమె తెలిపారు. ఈ ఆధార్ లింక్ చేయాలనే దానిపై వేసిన కేసులను ఈ నెల 30వ తేదీన సుప్రీంకోర్టు పరిశీలించనున్నది.
కేంద్ర ప్రభుత్వం నిరంకుశ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, కేంద్రంలో అధికారం నుంచి బీజేపీని తప్పించేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని ఆమె తెలిపారు. బీజేపీ పాలకులు ప్రజల స్వేచ్ఛ, హక్కుల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆమె విమర్శించారు. ఆధార్ నంబర్‌ను మొబైల్ ఫోన్‌కు లింకు చేయాలనడం తగదన్నారు.
నోట్ల రద్దుకు వ్యతిరేకంగా నవంబర్ 8న బ్లాక్ డే నిర్వహిస్తామని, ఆ రోజున రాష్ట్రంలో నల్ల జెండాలతో నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఎవరూ తనకు వ్యతిరేకంగా నోరెత్తకూడదని కేంద్ర ప్రభుత్వం ఐటీ, ఈడీ, సీబీఐ సంస్థలను ప్రయోగిస్తోందని బెనర్జీ ఆరోపించారు. తమ పార్టీ నాయకులందరూ జైలుకు వెళ్లినా సరే టీఎంసీ పోరాడుతుందని, తాము పిరికివాళ్లం కాదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment