సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వేడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగాల మధ్య కోల్డ్‌వార్‌కు దారి తీసింది. ఒక రాష్ట్రంలో మరో రాష్ట్రానికి చెందిన ఇంటెలిజెన్స్ సమాంతరంగా పనిచేయడం తెలంగాణ అధికారులకు కోపం తెప్పిస్తోంది. ఎన్నికల సర్వేలు నిర్వహించడంతోపాటు రాష్ట్రంలో తాజాగా జరిగిన ఐటీ దాడులు, ఈడీ కేసుల నమోదు నేపథ్యం గురించి, ఓటుకు నోట్లు కేసులో ఏసీబీ చర్యల గురించి ఏపీ ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి ఏపీ సీఎం చంద్రబాబుకు అప్‌డేట్ చేయడం తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులకు మింగుడుపడటం లేదు.
వరంగల్‌లో మొదలైన రగడ...
రాష్ట్రంలో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు వల్ల కలిగే లాభనష్టాలు, గెలిచే అవకాశమున్న సీట్ల సంఖ్య, ఎక్కడెక్కడ ఎవరి బలాబలాలు ఏమిటన్న అంశాలపై ఏపీ ఇంటెలిజెన్స్ సిబ్బంది 20 రోజుల క్రితం తెలంగాణలో మకాం వేశారు. ఇందులో భాగంగా వరంగల్‌లో తెలంగాణ ఇంటెలిజెన్స్ బృందాలు సర్వే చేస్తున్న సమయంలోనే ఓ డీఎస్పీ నేతృత్వంలో ఏపీ ఇంటెలిజెన్స్ బృందం సర్వే చేయడం సంచలనం రేపింది. ములుగు, వరంగల్ ఈస్ట్, పరకాల, భూపాలపల్లిలో తెలంగాణ ఇంటెలిజెన్స్ బృందాలు సర్వే చేస్తున్న సమయంలోనే ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు సైతం అవే నియోజకవర్గాల్లో సర్వే చేయడం తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులకు రుచించలేదు.
అలాగే వైరా, ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూడెంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు సర్వే చేస్తున్నప్పుడే ఏపీ ఇంటెలిజెన్స్‌కు చెందిన అదనపు ఎస్పీ నేతృత్వంలో 18 మంది సిబ్బంది తారసపడటం కూడా మింగుడు పడలేదు. తాము ఏయే నియోజకవర్గాల్లో సర్వే చేపడతామనే విషయం ఏపీ అధికారులకు ఎలా లీౖకై ందన్న అంశంపై తెలంగాణ ఉన్నతాధికారులు సమాలోచనలు చేశారు. మొత్తం 84 మంది ఏపీ ఇంటెలిజెన్స్ సిబ్బంది, అధికారులు తెలంగాణలో సర్వే చేస్తున్నట్లు గుర్తించారు.
రెండూ ఒకే భవనంలో... రాష్ట్ర ఇంటెలిజెన్స్, ఏపీ ఇంటెలిజెన్స్ విభాగాలు ఒకే భవనంలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఓటుకు కోట్లు కేసు తర్వాత ఏపీ అ«ధికారిక కార్యకలాపాలన్నీ అమరావతి తరలివెళ్లగా ఏపీ ఇంటెలిజెన్స్, పోలీస్ వ్యవస్థ 90 శాతం విజయవాడ, అమరావతికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి పెద్దగా ఏపీ ఇంటెలిజెన్స్ కార్యకలాపాలు సాగించలేదు. కేవలం చంద్రబాబు హైదరాబాద్ పర్యటనకు వచ్చే ముందే భద్రత పర్యవేక్షణ, నిఘా కార్యకలాపాల కోసం ఏపీ అధికారులు భాగ్యనగరానికి వచ్చేవారు.
కానీ తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో బాబు ఆదేశంతో ఏపీ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు రాష్ట్రంలోని ఏపీ ఇంటెలిజెన్స్ కార్యాలయంలో దిగడం, అమరావతి నుంచి సిబ్బందిని రప్పించడం.. ఉమ్మడి జిల్లాలకు డీఎస్పీ, అదనపు ఎస్పీ ర్యాంకు అధికారికి సర్వే బాధ్యతలు, నిఘా కార్యకలాపాలు అప్పగించడం చకచకా జరిగిపోయాయి. అయితే తెలంగాణ ఇంటెలిజెన్స్, ఏపీ ఇంటెలిజెన్స్ విభాగాలు ఒకే భవనంలో కొనసాగడం వల్లే ఈ సమాచారం లీకై ఉంటుందా అనే కోణంలో ఇక్కడి అధికారులు ఆరా తీస్తున్నారు.
సర్వే ఎక్కడెక్కడ చేస్తున్నారు? ఇక్కడ అధికార పార్టీ కార్యకలాపాలు ఎలా ఉన్నాయి? ఎక్కడెక్కడ అసంతృప్త అభ్యర్థులు బరిలో దిగబోతున్నారు? వారి వెనుకున్న కారణాలు ఏమిటి? నేతలెవరన్న సమాచారం ఏపీకి చేరడంతో లీక్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై కూపీ లాగుతున్నారు. రెండు విభాగాలు ఒకే చోట కార్యకలాపాలు సాగించడం వల్లే సమాచార మార్పిడి జరుగుతోందా లేక కోవర్టులు ఎవరైనా లీక్ చేస్తున్నారన్న అంశాలపై తెలంగాణ పోలీసుశాఖ దృష్టి సారించింది.
మరోవైపు ఐటీ దాడులపై తాము సేకరించిన, ఏపీకి పంపించిన కీలక నివేదికలు తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారుల చేతుల్లోకి ఎలా వెళ్లాయన్న అంశాలపై ఏపీ నిఘా ఉన్నతాధికారులు సైతం ఆగ్రహంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 74 స్థానాల్లో (హైదరాబాద్ మినహా) చేసిన సర్వే నివేదిక ఇప్పుడు తెలంగాణ నిఘా అధికారుల వద్ద ఉండటం కూడా ఏపీ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారుల ను ఆందోళనలో పడేసినట్లు తెలుస్తోంది.
అగ్గి రగిల్చిన ఐటీ సోదాలు
సర్వేలతోనే పర్వాలేదు అనుకొని రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు తొలుత పెద్దగా పట్టించుకోలేదు. కానీ రాష్ట్రంలోని ప్రముఖుల ఇళ్లలో ఐటీ దాడులు చేసేందుకు ప్రత్యేక బృం దాలు ఏర్పడటం, ఎక్కడెక్కడ చేయబోతున్నాయన్న విషయాలు ముందే గ్రహించి ప్రముఖులను అప్రమత్తం చేయడంతో రాష్ట్ర నిఘా అధికారులు కంగుతిన్నట్లు తెలిసింది. ఈ విషయం గ్రహించకపోవడం, పైగా ప్రముఖుల ఇళ్ల వద్ద రాష్ట్ర ఇంటెలిజెన్స్ సిబ్బంది కంటే ముందే ఏపీ అధికారులు ఉండి సమాచారం సేకరించడం ఆగ్రహానికి గురిచేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment