ఛత్తీస్‌గఢ్‌లో పదిహేనేళ్ల బీజేపీ పాలనకు తెరదించుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని 15 స్థానాలకు పరిమితం చేస్తూ కాంగ్రెస్ పార్టీ 90 సీట్లలో 68 సీట్లు కైవసం చేసుకొని ఘన విజయం సాధించింది. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ 11 స్థానాలకు 10 సీట్లు కైవసం చేసుకుంది. బీజేపీ ఓట్ల శాతాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గణనీయంగా తగ్గించగలిగింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 10 లోక్‌సభ స్థానాల పరిధిలో ఆధిక్యతను కనబర్చగా, బీజేపీ కేవలం ఒక్క స్థానంలోనే ఆధిక్యంలో ఉంది. మార్చి నెలలో ‘పోల్ ఐస్’ నిర్వహించిన సర్వే ప్రకారం ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఆధిక్యత కొంచెం తగ్గినట్లు తేలింది. కాంగ్రెస్ పార్టీ 8 లోక్‌సభ స్థానాల్లోనూ, బీజేపీ 3 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నట్లు ఆ సర్వే తేల్చి చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల తరువాత బీజేపీ పరిస్థితి కొంచెం మెరుగైనట్లు ఓటర్ల నాడి ద్వారా తెలిసిందని సర్వే ప్రకటించింది. ఆ సర్వే ప్రకారం 2018 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు 33 శాతం నుంచి, ఈ మార్చి నాటికి 41 శాతానికి పెరగనున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ ఓట్ల శాతం కూడా 43 నుంచి, 44కి పెరగవచ్చునని తెలిపింది.
చిన్నాచితకా పార్టీల ఓట్లన్నీ..
స్వతంత్ర అభ్యర్థుల నుంచి, చిన్ని చిన్న పార్టీలు, అజిత్ సింగ్‌కు చెందిన జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్, బహుజన్ సమాజ్ పార్టీ ఓట్లు గణనీయంగా తగ్గి కాంగ్రెస్, బీజేపీ లబ్ధి పొందనున్నట్టు ఆ సర్వే చెప్పింది. ఈ సర్వే ప్రకారం బీజేపీ జెంజిగిర్ – చంపా, కంకేర్, బిలాస్‌ఫూర్ స్థానాల్లో ఆధిక్యం కనపరుస్తుండగా, కాంగ్రెస్ పార్టీ సర్‌గుజా, రాయ్‌గఢ్, కోర్బా, రాజ్‌నంద్ గావ్, దుర్గ్, రాయ్‌పూర్, మహాసమంద్, బస్తర్ స్థానాల్లో ఆధిక్యత చూపనున్నట్టు తెలిపింది. అయితే ఆయా స్థానాల్లో ఆధిక్యత పది శాతం కన్నా తక్కువగానే ఉన్నందువల్ల, ఓట్ల శాతం కొంచెం అటూ ఇటూ అయినా ఫలితాలు మారవచ్చని తెలిపింది.
జోగి ఓట్లు ఎవరికి?
ఈ లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ జోగి తమ పార్టీ పోటీ చేయడం లేదని ప్రకటించడంతో సమీకరణాలు తారుమారయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జేసీసీ) పార్టీకి ఓట్లు వేసినవారు ఈసారి బీఎస్పీ, జోగీకి చెందిన పాత పార్టీ కాంగ్రెస్, లేదా బీజేపీలో ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాల్సి ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో ఫలితాలను నిర్ణయించటంలో ఈ ఓటర్లు నిర్ణయాధికార పాత్ర పోషించబోతున్నారు. పై నియోజకవర్గాల్లో ‘సత్నామీస్’ షెడ్యూల్డ్ కులానికి చెందిన సామాజిక వర్గం అధికంగా ఉంది. నిజానికి అదే అజిత్ పార్టీ ప్ర«ధాన ఓటు బ్యాంకు కూడా. బిలాస్‌పూర్, కోర్బా నియోజకవర్గాల్లో ఫలితాలను నిర్ణయించే స్థాయిలో అజిత్ పార్టీ జేసీసీ బలంగా ఉండడం గమనార్హం. అయితే గిరిజన ప్రాబల్యం అధికంగా కలిగిన ఉత్తర, దక్షిణ ఛత్తీస్‌గఢ్ జిల్లాల్లో అజిత్ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది.
ఆ రెండింటి ప్రభావం కూడా..
మరో రెండు అంశాలు ఛత్తీస్‌గఢ్ ఫలితాలను తారుమారుచేసే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
1. గత మూడు నెలల్లో మాదిరిగా బీజేపీ ఆదరణ ఇదే స్థాయిలో పెరిగితే, ఫలితాలు మారవచ్చు.
2. రాహుల్ గాంధీ ప్రకటించిన కనీస ఆదాయ పథకం, రైతులకు ఇచ్చిన వరాలు కాంగ్రెస్ పార్టీకి లబ్ది చేకూర్చే అవకాశాలున్నాయి.
ఉదాహరణకు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన రైతులకు ప్రత్యేక బడ్జెట్, రైతులు రుణాలను చెల్లించలేకపోతే వాటిని క్రిమినల్ నేరాలుగా పరిగణించకుండా సివిల్ నేరాలుగా పరిగణిస్తామని ప్రకటించడం ఆ పార్టీకి కలిసివచ్చే అవకాశం ఉంది. గత బీజేపీ ప్రభుత్వంలో రమణ్ సింగ్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల కారణంగా రమణ్‌సింగ్ మూడు దఫాలు ముఖ్యమంత్రిగా కొనసాగగలిగారు. అందువల్ల కాంగ్రెస్ ప్రకటించిన వరాలు ఆ పార్టీకి మెరుగైన ఫలితాలు అందించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జోగీ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించడం, బీజేపీకి పెరిగిన ఓట్ల శాతం, కాంగ్రెస్ ప్రకటించిన వరాలు వెరసి ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం ఫలితాలను సర్వేకు అతీతంగా ప్రభావితం చేసే అవకాశం కూడా ఉందన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం.
Comments
Please login to add a commentAdd a comment