సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ వరుస ట్వీట్లతో బురుద చల్లుకుంటున్నాయి. జైలు పక్షులు మీరేనంటూ పరస్పర ఆరోపణలతో ప్రచార వేడిని హోరెత్తిస్తున్నాయి. బీజేపీ చీఫ్ అమిత్ షా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అవినీతికి మరోపేరని గురువారం అభివర్ణించడంతో ట్వీట్ల యుద్ధానికి తెరలేచింది. ఓ మాజీ జైలు పక్షి తమ రాష్ట్రంలో సీఎం అభ్యర్థిగా మరో మాజీ జైలు పక్షిని ప్రకటించారని అమిత్ షా, యడ్యూరప్పలను ఉద్దేశించి సిద్ధరామయ్య చేసిన ట్వీట్ కలకలంరేపింది.
2010లో సోహ్రబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసులో అమిత్ షా కొంతకాలం జైల్లో ఉన్నారు. ఇక యడ్యూరప్ప బెంగళూర్‌లో అక్రమంగా భూ కేటాయింపులు జరిపిన కేసులో అరెస్టయి జైలు జీవితం గడిపారు. ఇరువురు నేతలు అటుతర్వాత ఆయా కేసుల నుంచి బయటపడ్డారు. అయితే సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేత, మాజీ సీఎం సదానందగౌడ కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు.
జైలు జీవితం గడిపిన వ్యక్తే ఇప్పుడు అస్థిత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని స్ధాపించగా, ఆ నేత కుమారుడు సైతం జైలులో ఉన్నారని సదానందగౌడ దుయ్యబట్టారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమయంలో విపక్ష నేతలను హతమార్చే కుట్రపన్నారన్న ఆరోపణలపై 1978లో ఆమెను అరెస్ట్ చేశారని, ఇక రాజీవ్ గాంధీ బోఫోర్స్ స్కామ్‌కు సంబంధించి అరెస్ట్ అయ్యారని..మీరు పెంచిపోషించిన ఉగ్రవాదమే ఆ తర్వాత రాజీవ్‌ను బలిగొందని సదానంద గౌడ చేసిన ట్వీట్ పెనుదుమారం రేపింది. అయితే సదానందగౌడ ఫ్లోలో ఈ వ్యాఖ్యలు చేసినా ఇందిరాగాంధీని స్వాతంత్యం రాకముందు బ్రిటీష్ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని, ఇక 1991లోనే రాజీవ్ హత్యకు గురికాగా ఆయన బోఫోర్స్ కుంభకోణంలో అరెస్ట్ అయ్యారని గౌడ ట్వీట్ చేయడం పట్ల నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment