న్యూఢిల్లీ: రక్షణ రంగంపై ఏర్పాటైన పార్లమెంటరీ ప్యానెల్‌లో వివాదాస్పద భోపాల్ ఎంపీ ప్రగ్యాసింగ్ ఠాకూర్‌ను సభ్యురాలిగా చేర్చడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాద కేసులో నిందితురాలు, మహాత్మాగాంధీని చంపిన నాథురాం గాడ్సే ఆరాధకురాలైన ప్రగ్యాసింగ్‌ను డిఫెన్స్ పార్లమెంటురీ ప్యానెల్‌లో చేర్చడం ద్వారా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు దేశాన్ని అవమానించిందని కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది.
కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో రక్షణ రంగంపై ఏర్పాటైన పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీలో మొత్తం 21మంది సభ్యులు ఉన్నారు. ఈ కమిటీలో మహారాష్ట్ర మాలెగావ్ పేలుళ్ల కేసు నిందితురాలైన బీజేపీ ఎంపీ ప్రగ్యాసింగ్ కూడా సభ్యురాలుగా ఉన్నారు. ఈ చర్యను తప్పుబడుతూ కాంగ్రెస్ పార్టీ ట్విటర్‌లో విమర్శలు గుప్పించింది. ‘డిఫెన్స్ పార్లమెంటరీ ప్యానెల్‌లో సభ్యురాలిగా ప్రగ్యాసింగ్‌ను బీజేపీ సర్కార్ నామినేట్ చేయడం దేశ భద్రతా బలగాలను, దేశ పౌరులను అమమానించడమే’ అని ట్వీట్ చేసింది. సచ్ఛీలత, నిజాయితీ గల నేతలను నియమించడానికి బదులు ఇలాంటి వారిని నియమించడం విడ్డూరమని ఎద్దేవా చేసింది. కోర్టుల్లో కేసులు ఎదుర్కొంటున్న ఇలాంటి వ్యక్తులను నియమించడం ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదని, బీజేపీకి 303 మంది ఎంపీలు ఉన్నారని, డిఫెన్స్ ప్యానెల్‌లో సచ్ఛీలురను నియమించడానికి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయని, ఐనా కావాలనే బీజేపీ ఈ చర్యకు పాల్పడిందని కాంగ్రెస్ దుయ్యబట్టింది.
Comments
Please login to add a commentAdd a comment