గాంధీనగర్: సార్వత్రిక ఎన్నికల ముందు గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగలనుంది. అధికార బీజేపీని ఎదిరించి కొద్దికాలంలోనే సంచలనం సృష్టించిన యువనేత, ఓబీసీ ఉద్యమ నేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్పేష్ ఠాకూర్ కొంత కాలంగా సొంత పార్టీపైనే అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేసి అధికార బీజేపీలో చేరతారని వార్తలు గుజరాత్‌లో బలంగా వినిపిస్తున్నాయి. ఠాకూర్ నాయకుల పట్ల కాంగ్రెస్ సరైన రీతిలో వ్యవహరించట్లేదని, తమకు తగిన ప్రాతినిథ్యం లభించట్లేదని అల్పేష్ తన అనుచరులతో వాపోయినట్లు సమాచారం. ఆయనతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యే కూడా పార్టీని వీడతారని తెలుస్తోంది.
ఫైర్‌బ్రాండ్ నాయకుడిగా పేరున్న అల్పేష్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, పార్టీ గుజరాత్ యూనిట్ పనితీరు పట్ల తాను సంతోషంగా లేనని చెప్పారు. పార్టీ అధ్యక్షుడికి కూడా ఆ విషయం చెప్పానని, యువనేతలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పానని అన్నారు. తన విషయం తాను చెప్పుకోవడం లేదని, తనకు తగిన గుర్తింపే ఇచ్చారని చెప్పారు. ఠాకూర్ కమ్యూనిటీకి చెందిన కొన్ని డిమాండ్లు తాను ప్రస్తావించినప్పటికీ పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ అగ్రనాయకత్వం పట్ల మనస్తాపంతో ఉన్న మాట నిజమేనని చెప్పారు. అల్పేష్ వ్యాఖ్యలపై పలువురు కాంగ్రెస్ నేతలు సైతం విమర్శలు ఎక్కుపెట్టారు. బీజేపీకి బీ-టీమ్‌గా అల్పేష్ వ్యవహరిస్తున్నారని, ఠాకూర్ల డిమాండ్లంటూ ఆయన చేస్తున్న వాదన చూస్తే బీజేపీలో చేరే అవకాశాలే కనిపిస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ను అల్పేష్ కాంగ్రెస్‌ను వీడుతారంటూ వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది.
Comments
Please login to add a commentAdd a comment