
శాసనమండలి సమావేశం శుక్రవారం ప్రారంభమైన వెంటనే గందరగోళం నెలకొంది. రైతుల సమస్యలపై ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానంపై చర్చకు కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టి నిరసనకు దిగారు. మండలి చైర్మన్ టి.స్వామి గౌడ్ చర్చకు అనుమతించకపోవడంతో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ నేతృత్వంలో ఆ పార్టీ సభ్యులు.. పోడియం వద్దకు చేరి నిరసనకు దిగారు. చర్చకు అంగీకరించకపోవడంతో నిరసన తెలుపుతూ సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రశ్నోత్తరాలు నిర్వహించిన చైర్మన్ అనంతరం సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేశారు.
గ్రూప్–2 పరీక్షలో అక్రమాలు జరగలేదు: తుమ్మల
సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ ఇటీవల నిర్వహించిన గ్రూప్–2 పరీక్షలో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణను రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తోసిపుచ్చారు. కాంగ్రెస్ సభ్యులు షబ్బీర్ అలీ, టి.సతీశ్ కుమార్ అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు.
నియామక ప్రక్రియలో సమయాన్ని తగ్గించేందుకు కొత్త తరహాలో ఓఎంఆర్ షీట్లను ప్రవేశపెట్టామని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మూడేళ్ల లోపు బాలలకు పాలు సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రంలో జాతీయ రహదారులను అనుసంధానిస్తూ ఏడు ప్రాంతీయ రింగ్ రోడ్డులను నిర్మిస్తున్నామని ఇంకో ప్రశ్నకు బదులిచ్చారు.
నాలాలపై ఆక్రమణలు తొలగిస్తాం: కేటీఆర్
హైదరాబాద్‌లో నాలాల కబ్జాలను తొలగించి వర్షాలతో నగర ప్రజలు ఎదుర్కొంటున్న చిక్కులను తొలగిస్తామని పురపాలక మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. కిర్లోస్కర్ కమిటీ సిఫారసుల ప్రకారం నాలాలపై నుంచి 28 వేల అక్రమ కట్టడాలను తొలగించడం ఆచరణలో సాధ్యం కాదని తెలిపారు. అయితే నాలాలపై నుంచి తొలగించిన పేదల ఇళ్లకు పరిహారం చెల్లిస్తామని చెప్పారు.
వర్షాలతో నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ సభ్యుడు ఎన్.రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు కేటీఆర్ బదులిచ్చారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లిలో ప్రాంతీయ విమానాశ్రయం ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరుగుతోందని, నివేదిక వచ్చిన తర్వాత విమానాశ్రయం ఏర్పాటు విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని టీఆర్‌ఎస్ సభ్యుడు ఆర్.భూపతిరెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు కేటీఆర్ బదులిచ్చారు.
త్వరలో మరో ఆయిల్‌పామ్ క్రషింగ్ యూనిట్: పోచారం
ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించేందుకు 60 టన్నుల సామర్థ్యంతో త్వర లో ఓ ఆయిల్‌పామ్ క్రషింగ్ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే అశ్వారావుపేటలో 17 టన్నుల సామర్థ్యం గల కర్మాగారం సామ ర్థ్యాన్ని 30 టన్నులకు పెంచామని తెలిపారు.
ఆయిల్‌పామ్ సాగుకు ప్రోత్సాహంపై టీఆర్‌ఎస్ సభ్యులు బి.లక్ష్మీనారాయణ, పల్లా రాజేశ్వర్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు పోచారం బదులిచ్చారు. రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత ఇక్కడ ఉత్పత్తి చేస్తున్న హైబ్రీడ్ సజ్జలు, హైబ్రీడ్ జొన్నలు, హైబ్రీడ్ మొక్కజొన్న, పశుగ్రాసం, వరి విత్తనాలను ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తున్నా మని టీఆర్‌ఎస్ సభ్యుడు కర్నె ప్రభాకర్ అడిగిన ప్రశ్నకు పోచారం సమాధానమిచ్చారు.