
భోపాల్ : మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పాలనపై మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి లేఖ రాశారు. చౌహాన్ దుష్టపాలనను అంతమొందించాలని ఆయన ఈ లేఖలో కోరారు. ‘2013 ఎన్నికల సమయంలో చౌహాన్ మహంకాళి ఆలయాన్ని సందర్శించుకున్న సమయంలో అనేక వాగ్ధానాలు చేశారు. మధ్యప్రదేశ్‌ను ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కానీ సీఎంగా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతుల బలవన్మరణాలు అధికంగా ఉన్నాయి. వ్యవసాయం చేస్తే నష్టపోవాల్సిందేనని రైతులు భావిస్తున్నారు. అవినీతి, కుంభకోణాలతో రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారు. వ్యాపం స్కామ్‌లో అమాయక విద్యార్థులను, వారి తల్లిదండ్రులను జైలు పాలు చేశారు’ అని కమల్‌నాథ్ తన లేఖలో పేర్కొన్నారు.
రైతులు న్యాయం కోరితే వారిపై కాల్పులు జరుపుతున్నారని ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం లేదని విమర్శించారు. చౌహాన్ చేసిన మోసాలకు, పాపాలకు అతన్ని శిక్షించాలని దేవున్ని లేఖ ద్వారా కోరారు. శనివారం రోజున చౌహాన్ మహంకాళి ఆలయాన్ని సందర్శించుకోనున్న నేపథ్యంలో కమల్‌నాథ్ ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌహాన్ రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. మహంకాళి అమ్మవారి ఆశీస్సులు తీసుకోని ఈ యాత్ర మొదలుపెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment