సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన ఎన్డీఏ సర్కారుపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ సహా ఏడు పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులపై స్పీకర్ సుమిత్రా మహాజన్ చర్చ చేపట్టకపోవడంతో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఒకదశలో ఏఐఏడీఎంకే ఎంపీలు.. కాంగ్రెస్ నేత ఖర్గేపై దాడికి యత్నించారు.
ఖర్గే ఫైర్: అవిశ్వాస తీర్మానం సభలోకి రానుండగా.. ఏడో రోజు కూడా అన్నాడీఎంకే ఎంపీలు నిరసనలు కొనసాగించారు. సభ ఆర్డర్‌లో లేదన్న కారణాన్ని చూపుతూ స్పీకర్.. అవిశ్వాసంపై చర్చ చేపట్టలేకపోతున్నానన్నారు. స్పీకర్ అలా మాట్లాడిన మరుక్షణమే కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే నిలబడి నిరసన తెలిపారు. ‘‘అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 50 కంటే చాలా ఎక్కువ మంది ఎంపీలు నిలబడ్డారు. ఇంకేం కావాలి మేడం? చర్చ మొదలుపెట్టండి.. ఈ ప్రభుత్వం ఇంకా ఎన్నాళ్లు పారిపోతుంది? చర్చ మొదలైనట్లు ప్రకటించండి..’’ అంటూ ఆవేశపూరితంగా మాట్లాడారు.
అనంతకుమార్ కౌంటర్: మల్లికార్జున ఖర్గే ఆవేశపూరిత మాటలతో సభ ఒక్కసారిగా వేడెక్కడం, విపక్ష ఎంపీలంతా ఆయనకు మద్దతు పలకడంతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ కౌంటర్ ఇచ్చేందుకు యత్నించారు. ‘‘కూటముల ఏర్పాటు నుంచి సీట్ల సర్దుబాట్ల దాకా కాంగ్రెస్ అన్నింటా విఫలమైంది. అలాంటి వాళ్లు అవిశ్వాసం పెడితే మేం భయపడతామా? ఎలాంటి చర్చకైనా సిద్ధంగా ఉన్నాం. సభలోపలేకాదు.. బయట కూడా విశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు మోదీ సర్కార్ సిద్ధంగా ఉంది’’ అని అన్నారు. ఈలోపే స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్‌సభను రేపటికి వాయిదావేశారు.
ఖర్గేపై దాడి!: సభ వాయిదా పడిన తర్వాత కాంగ్రెస్, ఏఐఏడీఎంకే సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ‘మిమ్మల్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం నాటకాలాడుతోంది.. బీజేపీకి ఎంతకు అమ్ముడుపోయారు?’ అని తమిళ ఎంపీలను ఉద్దేశించి ఓ కాంగ్రెస్ సభ్యుడు వ్యాఖ్యానించడంతో ఇరువర్గాల మధ్య ఉద్రికత్తత పెరిగింది. ఒకదశలో అన్నాడీఎంకే ఎంపీలు ఖర్గేపై దాడికి దూసుకురాగా, సోనియాగాంధీ అడ్డుపడ్డారు. తమిళ ఎంపీలను వారించి వెనక్కి పంపారు. ఆ కొద్ది సేపటికే పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఖర్గే.. అన్నాడీఏంకే-బీజేపీల తీరును తప్పుపట్టారు. ‘‘అవిశ్వాసాన్ని తప్పించుకునేందుకు ప్రభుత్వం.. అన్నాడీఎంకేను పావులా వాడుకుంటోంది. బయటికిమాత్రం చర్చకు సిద్ధమని అబద్ధపు ప్రకటనలు చేస్తోంది’ అని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment