తెలుగుదేశం పార్టీ సంప్రదాయ ఓటర్లు ఎటు వైపు మొగ్గుచూపుతారన్నది చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ వైపు వెళ్తారా? లేదా తమవిచక్షణ మేరకు ఓటేస్తారా? అనే చర్చ మొదలైంది. గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న టీడీపీ ఓటర్లు తమకు సానుకూలంగానే ఉంటారనే భావన ఒక వైపు ఉన్నా.. ఇంకో వైపు చేజారవచ్చన్న గుబులు కూడా కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకుని మొన్నటి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: టీడీపీ ప్రస్తుత ఎన్నికల్లో తమ అభ్యర్థిని బరిలోకి దించలేదు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఓటర్లు మొన్నటి పొత్తు ధర్మం మేరకు కాంగ్రెస్‌కు ఓటు వేస్తారా అనేది రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం టీడీపీ ఓటర్లపై గట్టి నమ్మకంతో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తమకే ఆ ఓట్లు దక్కుతాయని విశ్వసిస్తోంది. టీఆర్‌ఎస్‌కు ఎంఐఎం బహిరంగంగానే మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. రాజేంద్రనగర్‌లో ఎంఐఎంకు మంచి పట్టున్న నేపథ్యంలో ఆ ఓటర్లంతా టీఆర్‌ఎస్ వైపు ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో టీడీపీ క్యాడర్ చెల్లా చెదురైంది. చాలా మంది నాయకులు పార్టీ మారారు. అధిక శాతం మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరుపోగా మిగిలిన సంప్రదాయ టీడీపీ ఓటర్లపైనే కాంగ్రెస్ నమ్మకం పెట్టుకుంది. జిల్లాలో 2014 వరకు టీడీపీ పటిష్టంగా ఉంది. అప్పటి జనరల్ ఎన్నికల్లో చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లిలో టీడీపీ అభ్యర్థులే విజ యం సాధించారు. సెటిలర్లు అధిక సంఖ్యలో ఉన్న ఈ సెగ్మెంట్లలో ఆ పార్టీకి భారీగా ఓట్లు పడ్డాయి. మిగిలిన నాలుగు స్థానాల్లో ఇద్దరు చొప్పున కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. ఇక చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం విషయానికి వచ్చే సరికి టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు టీడీపీ గట్టి పోటీనిచ్చింది. ఈ పార్టీ అభ్యర్థి 26.84 శాతం ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. టీడీపీ అభ్యర్థి కంటే కాంగ్రెస్ అభ్యర్థి 0.67 శాతం ఓట్లే అధికంగా పొందటం గమ నార్హం.
మొత్తం 13.15 లక్షల ఓట్లు పోల్‌కాగా.. ఇందులో 3.53 లక్షల ఓట్లు టీడీపీకి పడ్డాయి. ఇటీవల శాసనసభ ఎన్నికలను పరిశీలిస్తే.. కాంగ్రెస్, టీడీపీలు పొత్తు కుదుర్చుకుని బరిలోకి దిగాయి. పొత్తులో భాగంగా రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి సెగ్మెంట్లను టీడీపీకి కేటాయించారు. ఈ రెండు స్థానాల్లో చెప్పుకోదగ్గ రీతిలోనే టీడీపీ అభ్యర్థులకు ఓట్లు దక్కాయి. చెల్లుబాటైన ఓట్లలో శేరిలింగంపల్లిలో 99,012 (35.39%), రాజేంద్రనగర్‌లో 50,591 (20.16%) ఓట్లు టీడీపీకి లభించాయి. ఇక మహేశ్వరంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపులో టీడీపీ ఓటర్ల పాత్ర ఉందని కూడా చెప్పవచ్చు. కొంత శాతం ఓట్లు కాంగ్రెస్‌కు మళ్లాయని స్పష్టంగా తెలుస్తోంది. ఈ మూడు సెగ్మెంట్లలో టీడీపీ సంప్రదాయ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీ అభ్యర్థికి విజయం సులువేనని తెలుస్తోంది. అయితే ఓటర్లు.. కాంగ్రెస్‌కు వైపు ఉంటారా? తమ విచక్షణ మేరకు ఓటేస్తారా? అని వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment