అమేథీలో రాహుల్‌కు రాంగ్ సిగ్నల్ పడింది. గాంధీ కుటుంబానికి నాలుగు దశాబ్దాలుగా ఆశ్రయమిస్తోన్న అమేథీలో, ఆ కుటుంబానికి అతి సన్నిహితుడైన వ్యక్తి నుంచే పోటీ ఎదురైంది. అక్కడ రాహుల్ గాంధీపై, కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడి కొడుకు పోటీ చేస్తానని ప్రకటించి రాహుల్‌కి ఝలక్ ఇచ్చాడు. రాహుల్ తండ్రి రాజీవ్‌గాంధీకీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకీ నామినేషన్ల అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాలపై సంతకం చేసిన వ్యక్తి కొడుకే నేరుగా రాహుల్‌పైన పోటీకి దిగుతుండడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మాజీ కాంగ్రెస్ నాయకుడు çహజీ సుల్తాన్‌ఖాన్, ఆయన కుమారుడు హజీ హరూన్ రషీద్ కాంగ్రెస్ నుంచి పూర్తిగా వైదొలిగినట్టు ప్రకటించారు.
రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఎందుకు పోటీ చేస్తున్నారని ప్రశ్నించగా.. చాలాకాలంగా స్థానిక కాంగ్రెస్ నాయకత్వం తమపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనీ, అలాగే ఈ ప్రాంత అభివృద్ధినీ, తమ సామాజిక వర్గాన్నీ నిర్లక్ష్యం చేసిన కారణంగానే తాము పార్టీని వీడినట్టు రషీద్ వివరించారు. అయితే కాంగ్రెస్‌ని ఢీకొట్టి ఎలా నెగ్గుకొస్తారన్న మీడియా ప్రశ్నకు సమాధానమిస్తూ అమేథీలో 6.5 లక్షల ముస్లింల ఓట్లున్నాయనీ, కాంగ్రెస్ వ్యతిరేకంగానే ఈ ఓట్లన్నీ పడతాయనీ రషీద్ అంటున్నారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీకి, సోనియాగాంధీకి సన్నిహితులుగా మెలిగిన ఈ తండ్రీ కొడుకులు రాజీవ్, సోనియా, ప్రియాంకతో తమ ఇంట్లో దిగిన ఫొటోలను సైతం రషీద్ చూపించారు. ఇప్పటికే అమేథీ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోన్న రాహుల్‌గాంధీకి రషీద్ ఇచ్చిన షాక్ చిన్నదేమీ కాదని నిపుణులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment