సాక్షి,న్యూఢిల్లీ: వాద్రా విమాన ఖర్చులను దళారీ చెల్లించాడనే ఆరోపణలను హైలైట్ చేస్తున్న బీజేపీకి కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ గతంలో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు 100కు పైగా చేసిన దేశీయ, అంతర్జాతీయ పర్యటనల విమాన ఖర్చులను ఎవరు భరించారని ప్రశ్నించింది. మోదీ చార్టర్డ్ విమానాలను పలు కార్పొరేట్ సంస్థలు స్పాన్సర్ చేశాయని పేర్కొంది. రాబర్ట్ వాద్రాకు విమాన టికెట్ల కోసం మధ్యవర్తి సంజయ్ భండారి రూ 10 లక్షల కోట్లు ఇచ్చారన్న బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ తోసిపుచ్చింది.
బీజేపీ చీఫ్ అమిత్ షా కుమారుడు జయ్ షాపై వచ్చిన ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ ఇలాంటి చౌకబారు ఎత్తుగడలకు పాల్పడుతోందని ఏఐసీసీ ప్రతినిధి అబిషేక్ సింఘ్వి అన్నారు. 2003 నుంచి 2007 వరకూ మోదీ విమాన ప్రయాణ ఖర్చులు రూ 16.56 కోట్లని ఆర్‌టీఐ కింద గుజరాత్ ప్రభుత్వం నుంచి తాను సేకరించిన వివరాల్లో వెల్లడైందని చెప్పారు. అయితే మోదీ చార్టర్డ్ విమానాల్లో విహరించేందుకు అయిన ఖర్చును ఎవరు చెల్లించారని దేశమంతా తెలుసుకోగోరుతోందని సింఘ్వి అన్నారు. 2007లో తాను దీనిపై ఆర్‌టీఐ కింద అడిగిన ప్రశ్నకు ఇంతవరకూ స్పందన లేదన్నారు.రూ 16.56 కోట్ల మేర ప్రయివేటు సంస్థలు ఇచ్చిన బహుమతిని ప్రభుత్వాధినేత ఎలా స్వీకరిస్తారని సింఘ్వి నిలదీశారు.
వాద్రా ఎయిర్ టికెట్లపై రక్షణ మంత్రి నిర‍్మలా సీతారామన్ కాంగ్రెస్ స్పందన కోరడాన్ని సింఘ్వి తోసిపుచ్చారు. ఏడేళ్ల కిందటి వ్యవహారాన్ని బీజేపీ ఇప్పుడు హైలైట్ చేస్తున్నదని వారు చెబుతున్న దళారీ ఇటీవల వరకూ మోదీ ప్రభుత్వానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment