సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు పెరుగుతున్నది. మూడో రోజైన ఆదివారం సీపీఐ జాతీయ నాయకుడు డి.రాజా దీక్షా శిబిరానికి వచ్చి వైఎస్సార్‌సీపీ ఎంపీలకు సంఘీభావం తెలిపారు. ప్రత్యేక హోదా అనేది సర్వత్రా వ్యక్తమవుతోన్న డిమాండ్ అని, దాదాపు అన్ని పార్టీలూ మద్దతు పలికాయని గుర్తుచేశారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ కేంద్రం, ప్రధాని నరేంద్ర మోదీల తీరును తప్పుపట్టారు.
‘‘ఏపీకి ప్రత్యేక హోదా ప్రతిపత్తి కల్పిస్తామని పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. కానీ ఆ మాటలను అపహాస్యం చేసే విధంగా కేంద్రం ప్రవర్తిస్తున్నది. తద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నది. రాష్ట్రానికి ఇచ్చిన హామీ నెరవేర్చకుంటే ఇక ఫెడరల్ స్ఫూర్తికి అర్థమేముంది? ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్‌ను, ఫీలింగ్స్‌ను కేంద్రం పట్టించుకోదా? వైఎస్సార్‌సీపీ ఎంపీలు ప్రాణాలను పణంగా పెట్టి దీక్ష చేస్తున్నారు. తక్షణమే ప్రధాని మోదీ స్పందించాలి. వెంటనే ఏపీకి హోదా ప్రకటించాలి. లేకుంటే బీజేపీ గడ్డుపరిస్థితితులు ఎదుర్కోకతప్పదు. హోదా విషయంలో ద్రోహం చేసిన పార్టీల సంగతి ఏపీ ప్రజలే చూసుకుంటారు’’ అని డి.రాజా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment