మాట్లాడుతున్న రామకృష్ణ
కర్నూలు, కల్లూరు (రూరల్): టీడీపీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. బుధవారం నగరంలోని దేవి ఫంక్షన్‌హాలులో సీపీఐ 22వ జిల్లా మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో విద్య, వైద్యం డబ్బున్న కోటీశ్వరులకు మాత్రమే దక్కుతుందన్నారు. జన్మభూమి కమిటీ నేతలు.. చనిపోయిన వారి పింఛన్లు కూడా వదలడం లేదన్నారు. నీతి మాలిన రాజకీయాలు చేస్తూ సంతలో పశువులను మాదిరిగా ఎమ్మెల్యేలను కొంటుండటం సిగ్గుచేటన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో కోట్ల నిధులు వృథా చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తీసుకురావడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారన్నారు.
ఎన్నికల హామీలను ప్రధాని నరేంద్రమోదీ విస్మరించారన్నారు. కేంద్రం బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం∙చేపట్టనున్న రాష్ట్రబంద్‌ను జయప్రదం చేయాలని కోరారు. బంద్‌కు వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ మద్దతు పలకడం సంతోషకరమన్నారు. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు కూడా బంద్‌లో పాల్గొనాలని హితవు పలికారు. రాష్ట్రానికి న్యాయం జరిగేంతవరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు. అంతకుముందు పార్టీ జెండా ఎగుర వేసి, మృతవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సంగీత దర్శకుడు ఖుద్దూస్, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి వి.నాగరాజు బృందం ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.జె.చంద్రశేఖర్‌రావు, సీనియర్ నాయకుడు ఎన్.మనోహర్ మాణిక్యం, రాష్ట్ర సమితి సభ్యుడు పి.భీమలింగప్ప, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.రామచంద్రయ్య, జగన్నాథం, జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.లెనిన్‌బాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment