k.ramakrishna
-
వారు కలిస్తేనే హోదా సాధ్యం: రామకృష్ణ
సాక్షి, వైఎస్సార్ కడప: రాబోయే రోజుల్లో సీపీఐ, సీపీఎం పార్టీలు దేశ రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయని ఆంధ్రప్రదేశ్ సీపీఐ కార్యదర్శిగా రెండోసారి ఎన్నికైన కె.రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ తమ పార్టీ 2015లోనే తీర్మానం చేసిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీలు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకోవడం మానేసి ప్రధాని నరేంద్ర మోదీపై పోరాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విజయవాడలో రేపు (మంగళవారం) ఉదయం 11 గంటలకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన విషయమై అన్ని సంఘాల నేతలతో కీలక సమావేశం నిర్వహిస్తామని అన్నారు. ‘ప్రత్యేక హోదా’ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా తెలిసేలా ఉద్యమిస్తామని ఉద్ఘాటించారు. కడపలో సోమవారం జరిగిన 26వ సీపీఐ రాష్ట్ర మహాసభల్లో కార్యదర్శి, సహాయ కార్యదర్శుల ఎన్నిక అనంతరం పలు ప్రజా సమస్యలపై పార్టీ నాయకులు చర్చించారు. -
చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం
కర్నూలు, కల్లూరు (రూరల్): టీడీపీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. బుధవారం నగరంలోని దేవి ఫంక్షన్‌హాలులో సీపీఐ 22వ జిల్లా మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో విద్య, వైద్యం డబ్బున్న కోటీశ్వరులకు మాత్రమే దక్కుతుందన్నారు. జన్మభూమి కమిటీ నేతలు.. చనిపోయిన వారి పింఛన్లు కూడా వదలడం లేదన్నారు. నీతి మాలిన రాజకీయాలు చేస్తూ సంతలో పశువులను మాదిరిగా ఎమ్మెల్యేలను కొంటుండటం సిగ్గుచేటన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో కోట్ల నిధులు వృథా చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తీసుకురావడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఎన్నికల హామీలను ప్రధాని నరేంద్రమోదీ విస్మరించారన్నారు. కేంద్రం బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం∙చేపట్టనున్న రాష్ట్రబంద్‌ను జయప్రదం చేయాలని కోరారు. బంద్‌కు వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ మద్దతు పలకడం సంతోషకరమన్నారు. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు కూడా బంద్‌లో పాల్గొనాలని హితవు పలికారు. రాష్ట్రానికి న్యాయం జరిగేంతవరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు. అంతకుముందు పార్టీ జెండా ఎగుర వేసి, మృతవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సంగీత దర్శకుడు ఖుద్దూస్, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి వి.నాగరాజు బృందం ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.జె.చంద్రశేఖర్‌రావు, సీనియర్ నాయకుడు ఎన్.మనోహర్ మాణిక్యం, రాష్ట్ర సమితి సభ్యుడు పి.భీమలింగప్ప, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.రామచంద్రయ్య, జగన్నాథం, జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.లెనిన్‌బాబు పాల్గొన్నారు. -
రైతు సంక్షేమం పట్టని చంద్రబాబు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజం అనంతపురం అర్బన్: కరువుతో రైతులు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమాత్రం పట్టించుకోవడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. ఆయనకు నంద్యాల ఉప ఎన్నిక తప్పితే మరేమీ కనిపించడం లేదన్నారు. సోమవారం ఆయన అనంతపురంలోని సీపీఐ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి డి.జగదీష్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తోందని.. ఈ ఏడాది మరింత దుర్భర పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 26 శాతం పంటలు మాత్రమే సాగయ్యాయన్నారు. అయితే రైతులను ఆదుకునే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. తుంగభద్రకు నీరు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని.. ఈ ఏడాది తాగునీటికి కూడా అవస్థలు తప్పేలా లేవన్నారు. ఇక రాష్ట్రంలో గిరిజనులు, దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. గరగపర్రు, దొండపాడు, దేవరపల్లి ఘటనలపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. దళితులపై దాడులకు నిరసనగా ఢిలీల్లో ఆందోళన చేపడతామన్నారు. ఈనెల 16న పది వామపక్ష పార్టీల నాయకులు దేవరపల్లి, దొండపాడులో పర్యటించి దళితుల్లో ఆత్మస్థైర్యం నింపనున్నట్లు చెప్పారు. త్వరలోనే కరువు పర్యటన నిర్వహించి ముఖ్యమంత్రికి కనువిప్పు కలిగిస్తామన్నారు. -
చైతన్యంతోనే బడుగులకు రాజ్యాధికారం
- బలహీన వర్గాలను పావులుగా వాడుకుంటున్న టీడీపీ - సామాజిక హక్కుల వేదిక రాష్ట్ర కన్వీనర్ రామకృష్ణ - ముగిసిన ప్రజా చైతన్య బస్సు యాత్ర అనంతపురం న్యూటౌన్ : తెలుగుదేశం ప్రభుత్వ ప్రజాకంటక విధానాలపై ఉద్యమిస్తామని సామాజిక హక్కుల వేదిక రాష్ట్ర కన్వీనర్ కె.రామకృష్ణ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజల సమస్యలపై చేపట్టిన ప్రజాచైతన్య బస్సుయాత్ర ముగింపు సభ శనివారం సాయంత్రం స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో వేదిక జిల్లా కన్వీనర్ జగదీష్ అధ్యక్షతన నిర్వహించారు. సభలో రామకృష్ణ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలను టీడీపీ పావులుగా ఉపయోగించుకుంటోందన్నారు. మంత్రి వర్గంలో ఎస్టీలు, ముస్లింలకు చోటు కల్పించకపోవడం శోచనీయమన్నారు. రానున్న రోజుల్లో ఆయా వర్గాల వారిని మంత్రి వర్గంలోకి తీసుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాజ్యాధికారమే లక్ష్యంగా బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలు చైతన్యంతో ఏకతాటిపై నడవాలని పిలుపునిచ్చారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన కేరళ వ్యవసాయ శాఖ మంత్రి సునీల్‌కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై పూర్తి నిర్లక్ష్య ధోరణిలో ఉందన్నారు. దేశ వ్యాప్తంగా ఒకే రకమైన అజెండాను అమలు చేయడానికి అణగారిన వర్గాలకు అన్యాయం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. అదేవి«ధంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు, బీసీ సంక్షేమ సంఘం రాయలసీమ జిల్లాల అధ్యక్షులు రమేష్ గౌడ్, సామాజిక హక్కుల వేదిక నాయకులు సత్యనారాయణమూర్తి, మైనార్టీ నాయకులు డాక్టర్ మైనుద్దీన్, జాఫర్, బీసీ సంఘం నాగభూషణం తదితరులు బీసీ, ఎస్సీలపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఆకట్టుకున్న ‘వందేమాతరం’ ముగింపు సభకు మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సినీ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన ‘వందేమాతర గీతం’ సభికులను అమితంగా ఆకట్టుకుంది. అలాగే ప్రజా నాట్యమండలి కళాకారులు, ప్రాచీన కళారూపాల ప్రదర్శనలతో, ఆటపాటలతో పలు చైతన్య గీతాలను అద్భుతంగా ఆలపించి అలరించారు. అంతకుముందు స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సామాజిక హక్కుల వేదిక నేతలు ర్యాలీగా సభాస్ధలికి చేరుకున్నారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన రజక సంఘం నాయకులు కమ్మన్న, దేవేంద్రప్ప, నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు ప్రసాద్, మహిళా సమాఖ్య నేతలు జయలక్ష్మి, దుర్గాభవానీ, కురుబ సంఘం బోరంపల్లి ఆంజనేయులు, బంజారా నేతలు కైలాష్‌నాయక్, ముస్లిం మైనార్టీ నాయకులు ఇమామ్, బాషా తదితరులు పాల్గొన్నారు. -
‘భూనిర్వాసితులకు ఉద్యోగం కల్పించాలి’
నంబులపూలకుంట : మండలంలో ఏర్పాటు చేస్తున్న సోలార్హబ్లో భూములు కోల్పోయిన ప్రతి రైతు కుటుంబంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని నాగులకట్ట వద్ద బుధవారం ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడారు. సోలార్‌లో ఉండే చిన్నపాటి ఉద్యోగాలను సైతం ఇతర ప్రాంతాల వారికి ఇస్తే ఇక్కడ ఉన్న యువకులు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించకపోతే రైతులతో కలిసి పోరాటం చేయడానికైనా తాము సిద్ధమన్నారు. డీసీఎంఎస్ డైరెక్టర్ టి.జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడారు. కదిరి డివిజన్ కార్యదర్శి వేమయ్య యాదవ్, మండల కార్యదర్శి అమీర్‌బాషా, జిల్లా కార్యవర్గ సభ్యుడు సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
నేడు సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం
అనంతపురం అర్బన్: సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం బుధవారం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం జరుగుతుందని తెలిపారు. సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర today కార్యదర్శి కె.రామకృష్ణ హాజరవుతారన్నారు. -
కార్పొరేట్ల కోసమే ల్యాండ్ బ్యాంక్
- జీవో 155 ఉపసంహరించుకోవాలి - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ విజయవాడ కార్పొరేట్ శక్తుల ప్రయోజనం కోసమే రాష్ర్టంలో 10లక్షల ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. పేదలు, దళితుల భూములను లాక్కొనేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 155ను ఉపసంహరించుకోవాలని సోమవారం ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. జీవో నంబర్ 155ద్వారా పేదలు, దళితుల వద్ద అసైన్డ్ భూములను నామమాత్రపు రేటు ఇచ్చి భూములు లాక్కొని కార్పొరేట్ శక్తులకు, పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ భూసేకరణ చట్టానికి అనుగుణంగా బహిరంగ మార్కెట్ విలువపై గిరిజన ప్రాంతాల్లో 1.5రెట్లు, షెడ్యూలేతర ప్రాంతాల్లో 1.25 రెట్లు, అదనంగా 12శాతం చెల్లించి భూ సేకరణ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఆయా నిబంధనలను తుంగలో తొక్కి బేసిక్ విలువ చెల్లింపు పేరుతో పేదల భూములు దోచుకోవడానికి ప్రయత్నాలు సాగించడం సరికాదని అన్నారు. ప్రభుత్వం ఇటువంటి చర్యలను చేపడితే ప్రజా ఉద్యమం ద్వారా ప్రతిఘటిస్తామని రామకృష్ణ హెచ్చరించారు. -
ఎందుకీ పనికిమాలిన క్యాబినేట్ భేటీలు?
- ఏపీ మంత్రివర్గ సమావేశాల తీరుపై సీపీఐ మండిపాటు హైదరాబాద్: కేవలం తాను తలచిన పనులకు ఆమోదముద్ర వేయించుకునేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ క్యాబినెట్ మీటింగులు పెట్టి మంత్రుల్ని విసిగిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. పూటలు, గంటల తరబడి క్యాబినెట్ మీటింగులు పెట్టి సాధిస్తున్నది ఏమిటో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొని సోమవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. క్యాబినెట్ భేటీల్లో ప్రజలకు పనికొచ్చే నిర్ణయాలేవీ తీసుకోవటంలేదని, ఆ మీటింగులన్నీ పక్కా బోగస్ అని టీడీపీ సర్కార్ పై రామకృష్ణ విరుచుకుపడ్డారు. ఒక్కో సమావేశానికి ఎంత ఖర్చవుతుందో, ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని క్యాబినెట్ మీటింగులు పెట్టి, ఎన్ని గంటల సమయం వెచ్చించారో చంద్రబాబు శ్వేత పత్రం విడుదలచేయాలన్నారు. ఈ ఏడాది సీపీఐ 90వ వార్షికోత్సవాల సందర్భంగా డిసెంబర్ నెలంతా వివిధ కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా జాతీయ కార్యవర్గం నిర్ణయించిందని, అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులతో సభలు, సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తామన్నారు. వార్షికోత్సవాల ముగింపు రోజున (ఈనెల 26న) విజయవాడలో భారీ సదస్సు జరుగుతుందని, దేశంలో హెచ్చరిల్లుతోన్న అసహనం, కరవవుతున్న భావస్వేచ్ఛ, అధిక ధరలు వంటి వాటిపై మంగళవారం నుంచి ఆదివారం వరకు రాష్ట్రంలో ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఈనెల 7న దేశరాజధాని ఢిల్లీలో మహాప్రదర్శన, ధర్నా నిర్వహించనున్నట్టు చెప్పారు. -
జగన్ దీక్షను పట్టించుకోకపోవడం శోచనీయం
కడప : ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాలుగు రోజులుగా నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ప్రత్యేక హోదా కోసం సీపీఐ చేపట్టిన పాదయాత్ర శనివారం కడప చేరింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ... చంద్రబాబు వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 22వ తేదీన రాజధాని శంకుస్థానకు వస్తున్న ప్రధాని మోదీపై అఖిల పక్షం తరఫున ప్రత్యేక హోదాపై ఒత్తిడి తీసుకోద్దామని ప్రతిపక్ష పార్టీలకు రామకృష్ణ సూచించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ... ప్రత్యేక హోదా సాధన సమితి చైర్మన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అక్టోబర్ 8వ తేదీన అనంతపురంలో పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర ఈ నెల 20న శ్రీకాకుళం జిల్లాలో పూర్తి కానుంది. -
'చంద్రబాబుకు భూమిపిచ్చి పట్టుకుంది'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి భూమిపిచ్చి పట్టుకుందని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. నూతన రాజధాని ప్రాంతంలో ఇప్పటికే సేకరించిన భూమి చాలదన్నట్టు.. ఇంకా సేకరిస్తూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకే భూమిని సేకరిస్తున్నారని విమర్శించారు. రాజధానికి, ఇతర అవసరాలకు ఎంత భూమి కావాలో చంద్రబాబు స్పష్టం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అదే విధంగా విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయానికి రెండు వేల ఎకరాలు అవసరమైతే 15,200 ఎకరాలు సేకరించారని మండిపడ్డారు. ఈ విధంగా సేకరించిన భూములన్నీ సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టేందుకేనని రామకృష్ణ విమర్శించారు. -
ఇసుక మాఫియా చేతిలో చంద్రబాబు బందీ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఇసుకు మాఫియా చేతిలో బందీ అయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లో రామకృష్ణ విలేకర్లతో మాట్లాడుతూ... ఇసుక మాఫియా ప్రతినిధిగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కృష్ణాజిల్లా ముసునూరు తహసీల్దార్ డి.వనజాక్షిపై దాడి చేసిన పార్టీ ఎమ్మెల్యే చింతమననే ప్రభాకర్‌ను విప్ పదవి నుంచి తొలగించి అరెస్ట్ చేయాలని ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో డీఎస్పీ హరినాథ్‌రెడ్డితో గొడవ జరిగితే వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని గుర్తు చేశారు. భూమా నాగిరెడ్డికి ఓ న్యాయం... చింతమనేనికి మరో న్యాయమా ? అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నిలదీశారు. -
గిరిజన చట్టాలు అమలు చేయాలి
గర్జించిన గిరిజనులు గాంధీనగర్ : పోలవరం దిగువన గిరిజన నిర్వాసితులకు భూములివ్వాలని, బాక్సైట్ అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని, గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ గిరిజనులు గర్జించారు. వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో హనుమంతరాయ గ్రంథాలయంలో గిరిజన గర్జన పేరుతో గురువారం సభ నిర్వహించారు. తొలుత తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ప్రదర్శనగా మహాత్మగాంధీ రోడ్డు, కారల్‌మార్క్స్ రోడ్డు మీదుగా లెనిన్ సెంటర్, అలంకార్ సెంటర్, న్యూఇండియా హోటల్ సెంటర్ మీదుగా గ్రంథాలయానికి చేరుకున్నారు. గిరిజన సంప్రదాయ వస్త్రధారణలో ఈటెలు, విల్లంబులు, బళ్లాలు, కత్తులు చేతబూని ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వాలు ఎన్ని మారినా గిరిజనుల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ఏ ప్రాజెక్టు ప్రారంభించిన గిరిజనుల జీవనాధారమైన భూములే లాక్కుంటున్నారని మండిపడ్డారు. కొండ ప్రాంతాల్లో భూగర్భ ఖనిజాలైన బాక్సైట్ తవ్వకాలకు పాల్పడుతున్నారని, పాలక ప్రభుత్వాల అండదండలతోనే తవ్వకాలు సాగుతున్నాయన్నారు. గిరిజన తండాల్లో విద్యుత్, రోడ్లు,తాగునీరు లేక అల్లాడుతున్నారన్నారు. వ్యాధుల బారిన పడి మృత్యువాత పడుతున్నారన్నారు. ప్రైవేటు రంగంలోనూ వీరికి రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. పార్టీ సహాయ కార్యదర్శి జేవీఎస్ మూర్తి , మాజీ ఎమ్మెల్యే జల్లి విల్సన్ మాట్లాడుతూ విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఏడాది గడుస్తున్నా దాని ఊసేత్తడం లేదన్నారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు నాశనం చేసే రీతిలో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్నారు. పట్టిసీమ బాధితులకు ఎకరానికి రూ. 25 లక్షలు ఇస్తూ, పోలవరం ముంపు బాధితులకు ఎకరానికి రూ. 1.15 లక్షలు ఇస్తున్నారని ఇది దుర్మార్గమన్నారు. గిరిజన నిర్వాసితులకు పోలవరం దిగువన హెక్టార్ భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర ఇవ్వాలన్నారు. గిరిజన చట్టాలను సక్రమంగా అమలు చేయాలని కోరారు. గిరిజన సమాఖ్య ప్రధాన కార్యదర్శి పి.గోవిందు అధ్యక్షతన జరిగిన ఈ సభలో డీహెచ్‌పీఎస్ రాష్ట్ర కన్వీనర్ సుబ్బారావు, బీమలింగప్ప, చంద్రానాయక్, గిరిజన సమాఖ్య విశాఖ జిల్లా నాయకులు కె.భూషణరావు, సత్యనారాయణ, మున్నంగి నర్సింహులు పాల్గొన్నారు. -
'చంద్రబాబు.. ప్రతిపక్షాలు రాక్షసులా..'
విజయవాడ టౌన్: ప్రతిపక్షాలను రాక్షసులతో పోల్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిగజారుడు వైఖరిని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కె.రామకృష్ణ శుక్రవారం ఓ ప్రకటనలో ఖండించారు. చంద్రబాబు సీఎంగా అధికారాన్ని చేపట్టి సంవత్సరం పూర్తయినా ఏనాడు ప్రతిపక్షాలను లెక్కచేయలేదని విమర్శించారు. ఏ ఒక్క ప్రాధాన్యతగల అంశంపైనా సంవత్సర కాలంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయలేదంటే చంద్రబాబు ఏకపక్ష వైఖరి తేటతెల్లమవుతోందన్నారు. ఏనాడు రాజధాని నిర్మాణం విషయంలో ప్రతిపక్షాల సలహాలను స్వీకరించని ముఖ్యమంత్రి.. తాము అడ్డుకుంటున్నామంటూ నిందలు మోపడం భావ్యం కాదన్నారు. సీఎంకు ప్రజాస్వామ్యం, ప్రతిపక్షాలపై గౌరవం ఉంటే తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి రాజధాని నిర్మాణానికి సంబంధించిన అన్ని అంశాలపై చర్చించాలని రామకృష్ణ కోరారు. -
సీపీఐ మహాసభలు ప్రారంభం
బొబ్బిలి: విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో సీపీఐ 11వ జిల్లాల మహాసభలు ఆదివారం ప్రారంభమయ్యాయి. నేతల ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు ఆర్టీసీ కాంప్లెక్స్‌నుంచి తాండ్ర పాపారాయుడు జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శి జేవీ సత్యాన్నారాయణమూర్తితో పాటు జిల్లాకు చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు. -
విశ్వసనీయత ఎందుకు కోల్పోయాం?
సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గం అంతర్మథనం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన సీపీఐ ఏపీ శాఖ పార్టీ నిర్మాణంపై దృష్టి సారించింది. ప్రజా విశ్వాసాన్ని తిరిగి పొందడానికి ఏమి చేయాలనే దానిపై అంతర్మథనం ప్రారంభించింది. కొత్తగా ఏర్పాటైన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గం బుధ, గురువారాల్లో సుదీర్ఘంగా చర్చించింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, వి.సత్యనారాయణమూర్తి, పీజే చంద్రశేఖర్, జి.ఓబులేసు, రావుల వెంకయ్య, జల్లి విల్సన్ తదితరులు హాజరయ్యారు. ఓట్లు, సీట్లు ఎలా ఉన్నా పార్టీ పునాదులు పూర్తిగా కదిలిపోవడం కార్యదర్శివర్గాన్ని తీవ్రంగా కలవరపరిచింది. నయా ఉదారవాద ఆర్థిక విధానాలతో ప్రజల ఆలోచనా సరళిలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయని అభిప్రాయపడింది. ఇకపై క్రియాశీల (మిలిటెంట్) పోరాటాలకు పార్టీ శ్రేణులను సంసిద్ధం చేయాలని నిర్ణయించింది. చట్టసభలో ప్రాతినిధ్యం లేనందున సభ దృష్టిని ఆకర్షించేందుకు నిత్యం జనం మధ్యలో ఉండాలని తీర్మానించింది. ఇందుకోసం తక్షణ సమస్యలుగా రుణమాఫీ, అసంఘటిత కార్మికులు, కౌలు రైతుల సమస్యల్ని గుర్తించింది. -
పోలవరం పేరిట చిచ్చుపెట్టొద్దు: సీపీఐ
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు పేరిట తెలుగు ప్రజల్లో చిచ్చుపెట్టొద్దని సీపీఐ ఏపీ రాష్ట్ర శాఖ కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూడడం ఏ మాత్రం సమంజసం కాదని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి ఏటా రెండు మూడు వేల టీఎంసీల గోదావరి నదీజలాలు వృథాగా సముద్రం పాలవుతున్నాయని, వాటిని సద్వినియోగ పరిచే ప్రయత్నాన్ని అడ్డుకోవద్దని టీఆర్ఎస్ సహా అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం ద్వారా మాత్రమే వెనుకబడిన, కృష్ణా నది ఎగువ ప్రాంతాలకు నీరందించడానికి వీలవుతుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు సత్వర న్యాయం జరిపించాలని, భూమి కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయ భూములు కేటాయించాలని రామకృష్ణ కోరారు -
కార్పొరేట్ల గుప్పెట్లో పాలకపక్షాలు: సీపీఐ
అభ్యర్థుల తొలి జాబితా విడుదల హైదరాబాద్: పాలకపక్ష పార్టీలపై కార్పొరేట్ శక్తులు పట్టు బిగిస్తున్నాయని సీపీఐ అభిప్రాయపడింది. బూర్జువా రాజకీయ పార్టీలలో ఫిరాయింపులు అసహ్యకరంగా పెరిగాయని పేర్కొంది. వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టులను, ప్రజాస్వామ్యవాదులను గెలిపించాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం శనివారం జరిగింది. రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా ఎన్నికల కమిటీలను నియమించింది. తెలంగాణ కమిటీకి చాడ వెంకటరెడ్డిని, ఆంధ్రప్రదేశ్‌కు కె.రామకృష్ణను కన్వీనర్లుగా నియమించినట్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలిపారు. ఒక లోక్‌సభ, 23 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులతో తొలిజాబితా విడుదల చేశారు. విశాఖపట్నం లోక్‌సభ: మానం ఆంజనేయులు అసెంబ్లీ అభ్యర్థులు: కూరంగి మన్మథరావు (పాలకొండ), చాపర వెంకటరమణ (పలాస), జన్ని రాము (సాలూరు), పి.కామేశ్వరరావు (ఎస్.కోట), జి.దేముడు (పాడేరు), జేవీ ప్రభాకర్ (పాయకరావుపేట), ఏజే స్టాలిన్ (గాజువాక), చలసాని రాఘవేంద్రరావు (విశాఖ పశ్చిమ), దేవరకొండ మార్కండేయులు (విశాఖ తూర్పు), కొంపెల్లి కృష్ణమాచారి (ఏలూరు), సోడెం వెంకటేశ్వరరావు (పోలవరం), మండల నాగేశ్వరరావు (తాడేపల్లి గూడెం), కొరగంజి దుర్గాంబ (విజయవాడ పశ్చి మ), దోనేపూడి శంకర్ (విజయవాడ తూర్పు), నవనీతం సాంబశివరావు (విజయవాడ సెంట్రల్), పి.తిరుమలయ్య (యర్రగొండపాలెం), కరవది సు బ్బారావు (ఒంగోలు), శిఖరం నరహరి (సర్వేపల్లి), పి.బాలకృష్ణ (వెంకటగిరి), కె.శ్రీనివాసులు (సూళ్లూరుపేట), జి.ఈశ్వరయ్య (కడప), ఎస్.వెంకటసుబ్బయ్య (బద్వేల్), పి.రామచంద్రయ్య (పత్తికొండ). -
ప్రత్యేక కాలువ ఏర్పాటు చేయండి
సాక్షి, బళ్లారి (కర్ణాటక) : తుంగభద్ర ఎగువకాలువ (హెచ్చెల్సీ)కు 44వ కి.మీ నుంచి 105 కి.మీ వరకు ప్రత్యేక కాలువ ఏర్పాటు చేయాలని అనంతపురం జిల్లా అఖిల పక్ష నేతలు డిమాండ్ చేశారు. నేతలు శనివారం టీబీ డ్యామ్, పరిశీలించారు. అనంతరం టీబీ బోర్డు సెక్రెటరీ రంగారెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ర్ట కార్యవర్గసభ్యులు, మాజీ ఎమ్మెల్యే కె.రామకృష్ణ, జిల్లా కార్యదర్శి జగదీష్, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కర్రా హనుమంతరెడ్డి మాట్లాడుతూ కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాకు రావాల్సిన వాటా నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్లో ‘అనంత’కు 32 టీఎంసీలు, కేసీ కెనాల్‌కు 10 టీఎంసీలు కలిపి మొత్తం 42 టీఎంసీలు నీరు అందాల్సి ఉండగా 22 టీఎంసీలు కూడా విడుదల కావడం లేదన్నారు. సమాంతర కాలువపై కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించాల్సిన అవసరం ఉందన్నారు. సమాంతర కాలువ వీలుకాకపోతే ెహ చ్చెల్సీలో 44వ కి.మీ నుంచి 105 కి.మీ వరకు ప్రత్యేక కాలువ తవ్వుకునేందుకు అనుమతివ్వాలన్నారు. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల రైతులకు సక్రమంగా నీరు అందాలంటే ముందుగా జలచౌర్యాన్ని అరికట్టాలన్నారు. అనంతపురం కలెక్టర్ లోక్ష్కుమార్ సూచించిన విధంగా ప్రత్యేక కాలువ ఏర్పాటు చేస్తేనే నీరు సక్రమంగా అందేందుకు వీలవుతుందన్నారు. రైతులకు అన్యాయం జరగకుండా దామాషా ప్రకారం తాగు, సాగునీటిని పంపిణీ చేయాల్సిన బాధ్యత తుంగభద్ర బోర్డుపై ఉందని ఎమ్మెల్సీ గేయానంద్ అన్నారు. దీనికి బోర్డు సెక్రటరీ రంగారెడ్డి స్పందిస్తూ తాను నెల రోజుల కిందే బాధ్యతలు తీసుకున్నానని, ఆంధ్రప్రదేశ్‌కు అందాల్సిన వాటాను సక్రమంగా అందించేందుకు కృషి చేస్తానన్నారు. జలచౌర్యాన్ని అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో అఖిలపక్ష నేతలు కాటమయ్య (సీపీఐ), ఓ.నల్లప్ప (సీపీఎం), అంకాలరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, రామకృష్ణారెడ్డి, ఓలేటి రత్నయ్య (బీజేపీ), పులిచెర్ల నిజాంవలి, ఆర్.ఎం.మధు, (లోక్‌సత్తా), పెద్దన్న (సీపీఐ ఎంఎల్), ఇ.ప్రభాకర్‌రెడ్డి (న్యూ డెమోక్రసీ), హంపాపురం నాగరాజు (రైతుసంఘం), పి.పెద్దిరెడ్డి, ఎం.కె.వెంకటరెడ్డి, (ఏపీ రైతుసంఘం), అనంతలక్ష్మి రాముడు, ప్రకాష్‌రెడ్డి (పండ్ల తోటల రైతు సంఘం) పాల్గొన్నారు.