- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజం
అనంతపురం అర్బన్: కరువుతో రైతులు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమాత్రం పట్టించుకోవడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. ఆయనకు నంద్యాల ఉప ఎన్నిక తప్పితే మరేమీ కనిపించడం లేదన్నారు. సోమవారం ఆయన అనంతపురంలోని సీపీఐ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి డి.జగదీష్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తోందని.. ఈ ఏడాది మరింత దుర్భర పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 26 శాతం పంటలు మాత్రమే సాగయ్యాయన్నారు.
అయితే రైతులను ఆదుకునే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. తుంగభద్రకు నీరు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని.. ఈ ఏడాది తాగునీటికి కూడా అవస్థలు తప్పేలా లేవన్నారు. ఇక రాష్ట్రంలో గిరిజనులు, దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. గరగపర్రు, దొండపాడు, దేవరపల్లి ఘటనలపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. దళితులపై దాడులకు నిరసనగా ఢిలీల్లో ఆందోళన చేపడతామన్నారు. ఈనెల 16న పది వామపక్ష పార్టీల నాయకులు దేవరపల్లి, దొండపాడులో పర్యటించి దళితుల్లో ఆత్మస్థైర్యం నింపనున్నట్లు చెప్పారు. త్వరలోనే కరువు పర్యటన నిర్వహించి ముఖ్యమంత్రికి కనువిప్పు కలిగిస్తామన్నారు.