సాక్షి, బళ్లారి (కర్ణాటక) : తుంగభద్ర ఎగువకాలువ (హెచ్చెల్సీ)కు 44వ కి.మీ నుంచి 105 కి.మీ వరకు ప్రత్యేక కాలువ ఏర్పాటు చేయాలని అనంతపురం జిల్లా అఖిల పక్ష నేతలు డిమాండ్ చేశారు. నేతలు శనివారం టీబీ డ్యామ్, పరిశీలించారు. అనంతరం టీబీ బోర్డు సెక్రెటరీ రంగారెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ర్ట కార్యవర్గసభ్యులు, మాజీ ఎమ్మెల్యే కె.రామకృష్ణ, జిల్లా కార్యదర్శి జగదీష్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కర్రా హనుమంతరెడ్డి మాట్లాడుతూ కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాకు రావాల్సిన వాటా నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్‌లో ‘అనంత’కు 32 టీఎంసీలు, కేసీ కెనాల్‌కు 10 టీఎంసీలు కలిపి మొత్తం 42 టీఎంసీలు నీరు అందాల్సి ఉండగా 22 టీఎంసీలు కూడా విడుదల కావడం లేదన్నారు.
సమాంతర కాలువపై కర్ణాటక ప్రభుత్వాన్ని ఒప్పించాల్సిన అవసరం ఉందన్నారు. సమాంతర కాలువ వీలుకాకపోతే ెహ చ్చెల్సీలో 44వ కి.మీ నుంచి 105 కి.మీ వరకు ప్రత్యేక కాలువ తవ్వుకునేందుకు అనుమతివ్వాలన్నారు. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల రైతులకు సక్రమంగా నీరు అందాలంటే ముందుగా జలచౌర్యాన్ని అరికట్టాలన్నారు. అనంతపురం కలెక్టర్ లోక్‌ష్‌కుమార్ సూచించిన విధంగా ప్రత్యేక కాలువ ఏర్పాటు చేస్తేనే నీరు సక్రమంగా అందేందుకు వీలవుతుందన్నారు. రైతులకు అన్యాయం జరగకుండా దామాషా ప్రకారం తాగు, సాగునీటిని పంపిణీ చేయాల్సిన బాధ్యత తుంగభద్ర బోర్డుపై ఉందని ఎమ్మెల్సీ గేయానంద్ అన్నారు.
దీనికి బోర్డు సెక్రటరీ రంగారెడ్డి స్పందిస్తూ తాను నెల రోజుల కిందే బాధ్యతలు తీసుకున్నానని, ఆంధ్రప్రదేశ్‌కు అందాల్సిన వాటాను సక్రమంగా అందించేందుకు కృషి చేస్తానన్నారు. జలచౌర్యాన్ని అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో అఖిలపక్ష నేతలు కాటమయ్య (సీపీఐ), ఓ.నల్లప్ప (సీపీఎం), అంకాలరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, రామకృష్ణారెడ్డి, ఓలేటి రత్నయ్య (బీజేపీ), పులిచెర్ల నిజాంవలి, ఆర్.ఎం.మధు, (లోక్‌సత్తా), పెద్దన్న (సీపీఐ ఎంఎల్), ఇ.ప్రభాకర్‌రెడ్డి (న్యూ డెమోక్రసీ), హంపాపురం నాగరాజు (రైతుసంఘం), పి.పెద్దిరెడ్డి, ఎం.కె.వెంకటరెడ్డి, (ఏపీ రైతుసంఘం), అనంతలక్ష్మి రాముడు, ప్రకాష్‌రెడ్డి (పండ్ల తోటల రైతు సంఘం) పాల్గొన్నారు.
ప్రత్యేక కాలువ ఏర్పాటు చేయండి
Published Sun, Nov 17 2013 3:08 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM